Begin typing your search above and press return to search.

ప్రపంచ చాంఫియన్.. వ్యక్తిగతంగా హిజాబ్ అంటే ఇష్టమట

By:  Tupaki Desk   |   24 May 2022 2:47 AM GMT
ప్రపంచ చాంఫియన్.. వ్యక్తిగతంగా హిజాబ్ అంటే ఇష్టమట
X
ఏళ్లకు ఏళ్లుగా కష్టపడినప్పటికీ కొన్నిసార్లు సానుకూల ఫలితాలు నమోదు కావు. అలాంటి కష్టమే ఎదురై.. అకుంఠిత దీక్షతో.. లక్ష్యాన్ని సాధించాలన్న కసితో శ్రమించిన తెలుగమ్మాయ్.. హైదరాబాద్ కు చెందిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన నిఖత్ జరీన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ప్రపంచ చాంపియన్ కలను నిజం చేసుకున్న ఆమె.. ఆ సంతోషంలో ఉంది. ఇలాంటి వేళ.. ఆమెను వివాదంలోకి నెట్టే ప్రశ్న ఒకటి ఎదురైంది.

రింగులో ఉన్న వేళలో ఎదురయ్యే అనూహ్య పంచ్ ను సమర్థంగా ఎదుర్కోవటం ఎంత అవసరమో.. బయట ప్రపంచంలోనూ ఎదురయ్యే అనూహ్య ప్రశ్నల పంచ్ ల్ని అంతే తెలివిగా డీల్ చేయాల్సిన అవసరం విజేతల మీద ఉంటుంది.

ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుంది. తాజాగా అలాంటి అనుభవమే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కు ఎదురైంది.

తాజాగా ఆమె మీడియాతో మాట్లాడిన వేళ.. వస్త్రధారణ విషయంపై ఆమె అనూహ్యమైన ప్రశ్నను ఎదుర్కొన్నారు. హిజాబ్ మీద ప్రపంచ వ్యాప్తంగా పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ.. దానికి సంబంధించిన ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి బదులిచ్చే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది నిఖత్ జరీన్.

ఒకరి వేషధారణ పూర్తిగా వారి వ్యక్తిగత అంశంగా పేర్కొంది. హిజాబ్ ధారణ ఎవరి ఇష్టం వారిదని.. దానిపై తానేమీ వ్యాఖ్యానించనని పేర్కొంది. తన అభిప్రాయం తనకు ఉంటుందన్న ఆమె.. పర్సనల్ గా తాను హిజాబ్ ను ధరించటానికి ఇష్టపడతానని వెల్లడించింది.

''హిజాబ్ ఎవరిష్టం వారిది. దానిపై నేనేమీ వ్యాఖ్యానించను. నా అభిప్రాయం నాకు ఉంటుంది. వ్యక్తిగతంగా నేను హిజాబ్ ధరించటానికి ఇష్టపడతాను. నాకెలాంటి అభ్యంతరాలు లేవు. నా కుటుంబానికి కూడా. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే దానితో నాకు సంబంధం లేదు'' అంటూ ఎవరికి ఎలాంటి నొప్పి తగలని రీతిలో తన సమాధానాన్ని చెప్పి.. పెద్ద వివాదం నుంచి ఆమె సింఫుల్ గా తప్పించుకున్నారని చెప్పక తప్పదు.