Begin typing your search above and press return to search.

సప్లయి చేస్తున్నాం.. మన పోలీసులకు తప్ప

By:  Tupaki Desk   |   2 Aug 2015 9:14 AM GMT
సప్లయి చేస్తున్నాం.. మన పోలీసులకు తప్ప
X
ఇటీవల గుర్ దాస్ పూర్ పోలీస్ అవుట్ పోస్టుపై ఉగ్రవాదులు దాడిచేసిన సంగతి తెలిసిందే.. ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో పోలీసులు మృతిచెందారు. దానికి కారణాలు సుస్పష్టం... ఉగ్రవాదులతో పోరాటానికి వెళ్లినవారికి తలకు హెల్మెట్లు లేవు... సరైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లూ లేవు... పురాతన కాలం నాటి ఎస్సెల్లార్ తుపాకులతో వీరుంటే ఎకే 47లతో ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించేశారు. ఇండియన్ పోలీసులకు గుండె ధైర్యం ఉంది కానీ అదేసమయంలో అధునాతన స్వీయ రక్షణ పరికరాలూ వాడితేనే ప్రాణాలు కాపాడుకుంటూ దేశాన్ని కాపాడొచ్చు.. కానీ.. ఈ విషయంలో మాత్రం ముందడుగు పడడం లేదు. భారత దేశంలో పోలీసులకు కానీ, మిలట్రీలో కానీ సరైన రక్షణ పరికరాలు వాడడం లేదన్న వాదన ఉంది... అయితే.. ప్రపంచంలో 100 దేశాలకు తిరుగులేని స్వీయ రక్షణ పరికరాలు సరఫరా చేస్తున్నది మాత్రం భారత దేశమే. మన టెక్నాలజీ మనకు తప్ప ఇతర దేశాలన్నిటికీ ఉపయోగపడుతోంది.

సుమారు 14 ఏళ్ల కిందట 2001లో పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగినప్పుడు ఎదురొడ్డిన పోలీసులకు రక్షణ పరికరాలే లేవు. ఆ తరువాతా పరిస్థితి మారలేదు... 2008లో ముంబయి ఉగ్రదాడి సమయానికి కూడా పరిస్థితి మారలేదు... ఉగ్రవాదులకు ఎదురెళ్లిన కొందరు పోలీసుల వద్ద లాఠీలు తప్ప ఇంకేమీ లేవు. కొద్దిమంది మాత్రమే హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించారు. ఆ హెల్మెట్లు కూడా క్రికెటర్లు వాడే హెల్మెట్లట... మరి క్రికెట్ బంతిని ఆపే హెల్మెట్ తూటాను ఎంతవరకు ఆపుతుందో మనమే అర్థం చేసుకోవాలి.

రక్షణ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నవి వింటే ఆశ్చర్యపోవాల్సివస్తోంది. వందేళ్ల కిందట మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులు వాడినన్ని రక్షణ పరికరాలు కూడా 2015లో ఇప్పటి మన పోలీసులు వినియోగించడం లేదట.. ఇదేసమయంలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే.... యుద్ధ సాంకేతికత, యుద్ధంలో రక్షణనిచ్చే పరికరాల తయారీలో ప్రపంచంలోనే ఇండియా టాప్ పొజిషన్లో ఉందట. ఇండియాలో తయారయ్యే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లకు ఉన్న అడ్వాన్సుడు ఫీచర్స్ ప్రపంచంలో ఇంకే దేశం తయారుచేసే పరికరాలకూ లేదు. మనదేశంలో తయారయ్యే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు 100కి పైగా దేశాల్లోని 230కిపై రకాల రక్షణ బలగాలు వినియోగిస్తున్నాయి. బ్రిటీష్, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్ ఆర్మీ... జపాన్, అమెరికా పోలీసులు కూడా ఇవే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు వినియోగిస్తున్నారట.

కాన్పూర్ లోని ఎంకేయూ సంస్థ వీటిని తయారుచేస్తోంది. వివిధ రాష్ట్రాలు తమ పోలీసుల కోసం ఇవి కొనుగోలు చేయాలని గతంలో ప్రయత్నించి అవి నాణ్యత కంటే ధరపైనే దృష్టి పెడుతున్నాయని... అంతర్జాతీయ ప్రమాణాలున్న వీటిని కొనుగోలు చేయడం లేదని చెబుతున్నాయి. మొత్తానికి ప్రపంచమంతా కొంటున్న ఈ రక్షణ ఉత్పత్తులు మన పోలీసులకు మాత్రం రక్షణ కల్పించలేకపోతున్నాయి.