Begin typing your search above and press return to search.

7 మామిడిపండ్ల కోసం అంత భారీ సెక్యురిటీ ఎందుకు?

By:  Tupaki Desk   |   18 Jun 2021 6:30 AM GMT
7 మామిడిపండ్ల కోసం అంత భారీ సెక్యురిటీ ఎందుకు?
X
మీరు చదివింది నిజమే. ఏడంటే ఏడు మామిడి పండ్లు. దానికి నలుగురు వ్యక్తులతో.. ఆరు కుక్కలతో కాపలా కాస్తూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆ ఏడు మామిడి పండ్లను డెలివరీ ఇచ్చే వరకు ఈ తిప్పలు తప్పవన్న మాట వాటి యజమాని నోటి నుంచి వస్తోంది. ఇంతకీ ఆ మామిడిపండ్లకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? అన్న విషయం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. సాధారణంగా మామిడిపండ్లు కేజీ 50 రూపాయిలకు దొరుకుతాయి. కాస్త ఖరీదనుకుంటే కేజీ రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతుంది. అంతకు మించిన ధర అంటే చాలా అరుదుగానే వింటాం. చూస్తుంటాం. కానీ.. ఇప్పుడు చెప్పే మామిడిపండ్లు రోటీన్ కు భిన్నం.

ఒక్కో మామిడి పండును రూ.21 వేలు పెట్టి కొనుగోలు చేస్తారు. అంతేనా వీటి కేజీ ధర ఏకంగా రూ.2.70లక్షలు. విన్నంతనే నిజమా? అనిపించే ఈ మామిడి పండ్లలో ఏమైనా బంగారం ఉంటుందా? ఏమిటంత స్పెషల్ అంటే.. ఇవి చాలా అరుదైన మామిడి జాతి పండ్లుగా చెబుతారు వీటి యజమాని మధ్యప్రదేశ్ కు చెందిన పరిహార్.

ఈ పండ్లు జపాన్ కు చెందిన మియజాకి అనే అరుదైన మామిడి వంగడం. నిజానికి ఈ మొక్క అనూహ్యంగా అతని చేతికి వచ్చింది. జబల్ పూర్ కు చెందిన పరిహార్ ఒకసారి చెన్నైకి ట్రైన్ లో వెళుతుంటే.. ఒక వ్యక్తి ఈ మొక్కను ఇచ్చాడు. అతడు ఈ మొక్కను ఇచ్చినప్పుడు దీని ప్రత్యేకత గురించి అసలేమీ తెలియదు. ఆ మొక్క ప్రపంచంలోనే అత్యంత ధర పలికే మామిడి మొక్క అని తెలీదు.

ఇంటికి తీసుకెళ్లి నాటిన తర్వాత.. దానికి కాసిన కాయతో దీని ప్రత్యేకత అర్థమైంది. ఒక వ్యాపారి ఒక పండును రూ.21వేలు పెట్టి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత దీని ధర తెలీటంతో వాటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ చెట్టుకుకాసిన ఏడు మామిడి పండ్ల కోసం నలుగురు వ్యక్తులు.. ఆరు కుక్కలతో కాపాలా కాస్తున్నారు. కేజీ రూ.2.7లక్షలు పలికే వేళ.. ఈ మాత్రం సెక్యురిటీ అవసరమే.