Begin typing your search above and press return to search.

మూడు చెరువులకు వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు

By:  Tupaki Desk   |   1 Dec 2020 1:30 AM GMT
మూడు చెరువులకు వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు
X
రాష్ట్రంలోని మూడు నీటి ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేసీ కెనాల్, కంభం చెరువు, పోరుమామిళ్ళ చెరువులకు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ గుర్తింపు లభించింది. ఇండియా మొత్తం మీద నాలుగంటే నాలుగు ప్రాజెక్టులు ఎంపికైతే అందులో మూడు ఏపికి చెందినవే కావటం గమనార్హం. నాలుగో చెరువు మహారాష్ట్రలోని ధామాపూర్ చెరువు.

కేసీ కెనాల్ ను బ్రిటీష్ హయాంలో కర్నూలు-కడప జిల్లాల మధ్య తవ్వించారు. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలోని సుంకేశుల బ్యారేజి నుండి కడప జిల్లాలోని కృష్ణరాజపురం వరకు ఈ కాలువను తవ్వించారు. అప్పట్లో బ్రిటీష్ వాళ్ళ కేవలం సరుకు రవాణా కోసమే ఈ కెనాల్ ను తవ్వించారు. తర్వాత్తర్వాత ఇది సాగునీటి ప్రాజెక్టుగా మారిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలు సాగవుతోంది. తుంగభద్ర-పెన్నా మధ్య ఉన్న 305 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ విస్తరించుంది.

ఇక ప్రకాశం జిల్లాలోని కంభం చెరువుకు చారిత్రక నేపధ్యమే ఉంది. ఈ చెరువును శ్రీకృష్ణదేవరాయులు తవ్వించారు. మొత్తం ఆసియా ఖండంలోనే ఇంతటి పెద్ద చెరువు ఇంకోటి లేదని చెప్పుకుంటుంటారు. దీనికింద కూడా వేలాది ఎకరాలు సాగులో ఉన్నాయి. చివరది కడప జిల్లాలోని పోరుమామిళ్ళ చెరువు. దీనికి కూడా 500 సంవత్సరాల చరిత్రుంది. ప్రస్తుతం ఈ చెరువు పూర్తిగా వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతోంది.