Begin typing your search above and press return to search.

భార్యకు భరణం చెల్లించినా ప్రపంచ కుబేరుడిగా అతడిదే మొదటిస్థానం

By:  Tupaki Desk   |   6 July 2021 1:30 PM GMT
భార్యకు భరణం చెల్లించినా ప్రపంచ కుబేరుడిగా అతడిదే మొదటిస్థానం
X
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా 2021 సంవత్సరం ఒక విషయంలో మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పాలి. కరోనా మహమ్మారి ఇచ్చిన షాక్ కు సరిసమానమైన షాక్ ను ఇచ్చారు ప్రముఖులు. రంగాలు ఏదైనా.. సుదీర్ఘకాలంగా సాగిన తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేయటం.. తమ దాంపత్య బంధానికి కటీఫ్ చెప్పేసిన ప్రముఖులు 2021లో ఎక్కువగా కనిపిస్తారు. కలలో కూడా ఊహించని ప్రముఖులు తాము విడిపోతున్నట్లుగా ప్రకటించారు. అలాంటి వారిలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.

భార్యకు విడాకులు ఇచ్చేసి.. ఆ క్రమంలో ఆమెకు భారీగా భరణం ఇచ్చేసిన తర్వాత ప్రపంచ కుబేరుడు స్థానంలో బెజోస్ నిలవటం విశేషం. అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకున్నప్పటికీ ఆయన టాప్ లోనే సాగుతున్నారు. తాజాగా బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం ఆయన సంపద ఏకంగా రూ.15 లక్షల కోట్లుగా తేల్చారు. అంటే.. మన దేశ వార్షిక బడ్జెట్ కు సగం (కాస్త తక్కువగా)గా ఆయన ఆస్తిగా తేల్చారు.

తాజాగా అమెజాన్ సీఈవోగా తన బాధ్యతను ఆండీ జాసీకి కట్టబెట్టిన బెజోస్..సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా కొనసాగుతారు. సంస్థకు చెందిన మెజార్టీ వాటా ఆయన చేతుల్లోనే ఉండనుంది. తన భార్య మెకంజీ స్కాట్ కు విడాకుల సమయంలో తన వద్ద ఉన్న అమెజాన్ షేర్లలో 25 శాతాన్ని ఆమెకు ఇచ్చేశారు. దీంతో..ఆయన సంపద తగ్గుతుందన్న అంచనాకు భిన్నంగా ఆయనే ప్రపంచ కుబేరుడిగా నిలవటం విశేషంగా చెప్పాలి. కరోనా నేపథ్యంలో ఈ-కామర్స్ బిజినెస్ కు భారీ డిమాండ్ ఏర్పడటంతో వాటి షేర్లు భారీగా పెరిగాయి. దీంతో.. భార్యకు ఇచ్చిన భరణం లోటు కాస్తా పూడుకు పోయింది. గత ఏడాది అమెజాన్ సీఈవోగా బెజోస్ 81,840 డాలర్ల మొత్తాన్ని అందుకున్నారు. ఇది కాక వివిధ రూపాల్లో మరో 16 లక్షల డాలర్లు (రూ.11.92 కోట్లు) అందుకున్నారు. ఇంత భారీగా సంపద ఉన్న బెజోస్ లోని మరో షాకింగ్ కోణం ఏమిటో తెలుసా? ఆయన.. ఇప్పటివరకు అసలు పన్నులే చెల్లించరట. సగటు అమెరికన్లు.. తమ సంపాదనలో పన్ను మొత్తాల్ని ఠంచనుగా చెల్లించే గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నం అమెజాన్ అధిపతిగా చెబుతారు.