Begin typing your search above and press return to search.

అమెరికా అతడ్ని లేపేయటంతో మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీసిందా?

By:  Tupaki Desk   |   4 Jan 2020 4:31 AM GMT
అమెరికా అతడ్ని లేపేయటంతో మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీసిందా?
X
ఒకట్రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. థర్డ్ వరల్డ్ వార్ పేరుతో సాగుతున్న ఈ ట్యాగ్ ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్ జీసీ) లోని అత్యంత శక్తివంతమైన కుర్దు ఫోర్సుకు జనరల్ గా వ్యవహరిస్తున్న ఖాసీం సులేమానీని తాజాగా లేపేసిన ట్రంప్ నిర్ణయం కొత్త ఉద్రిక్తతలకు తెర తీయటమే కాదు.. తాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం వైపుగా అడుగులు పడుతున్నాయా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ప్రపంచానికే పెద్దన్న అమెరికాకు నేరుగా వార్నింగ్ ఇవ్వటం.. ఇటీవల ట్రంప్ కు సైతం హెచ్చరికలు ఇవ్వటం ద్వారా సంచలనంగా మారిన సులేమానీని నిర్మోహమాటంగా లేపేసిన అమెరికా చర్యపై ఇరాన్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఇంతకీ ఈ ఖాసీ సులేమానీ ఎవరు? ఆయన మరణం ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారనుందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

సాధారణ కుటుంబం నుంచి సొంత కష్టంతో పైకి వచ్చిన వ్యక్తిగా ఖాసీం సులేమానీని చెప్పొచ్చు. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయంపై దాడి చేసిన అమెరికా.. సులేమానీని విజయవంతంగా హతమార్చింది. దీంతో.. ఇరాన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుర్దు ఫోర్స్ కు చీఫ్ గా వ్యవహరిస్తున్న సులేమానీని ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియా ముస్లింలకు అనుకూలంగా కార్యకలాపాల్ని సాగిస్తుంటారు. చివరకు ఇరాక్ లోని కుర్దులకు కూడా.

ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమైనీకి మాత్రమే జవాబుదారీగా ఉంటే సులేమాన్.. 1957లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఇరాన్ లోని రాబోర్ ప్రాంతంలో సులేమాన్ నివసించేవారు. అప్పట్లో ఆయన గడిపిన ప్రదేశం ఎంత అందమైనదంటే.. ఆప్రియోకాట్.. వాల్ నట్.. పీచ్ తోటలు విస్తారంగా ఉండేవి. ఆ ప్రాంతానికి చెందిన ఎంతోమంది యువకులు ఇరాన్ సైన్యంలో పని చేస్తుండేవారు. తన పదమూడేళ్ల వయసులో ఒక నిర్మాణ రంగ సంస్థలో కార్మికుడిగా వ్యవహరించిన ఆయన.. జిమ్ కు వెళ్లటం.. ఖాళీ వేళల్లో ఖమైనీలు నిర్వహించేవారు.

కరాటేలో బ్లాక్ బెల్ట్ అందుకున్న సులేమానీ 1979లో ఇస్లామిక్ రివల్యూషన్ తర్వాత ఐఆర్ జీసీలో చేరారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇరాక్ - ఇరాన్ మధ్య యుద్ధం రావటం.. అది ఏకంగా ఎనిమిదేళ్ల పాటు సాగటం.. ఆ సందర్భంలో ఇరాక్ చేసిన రసాయనిక దాడిలో సులేమానీ టీం చిక్కుకొని బయటపడింది.
ఈ యుద్ధం తర్వాత నాటి ఇరాన్ అధ్యక్షుడు రఫ్సంజానీతో ఉన్న గొడవలలో 1987-97 వరకు అండర్ గ్రౌండ్ లో ఉండిపోయారు. ఎప్పుడైతే రఫ్సంజానీ చేతి నుంచి పవర్ చేజారిదో కుర్ద్ ఫోర్స్ కు కమాండర్ స్థాయికి ఎదిగారు. అతని పవర్ ఎంతన్న విషయం ప్రపంచానికి బాగా అర్థమైంది మాత్రం ఆయన కుమార్తె వివాహ సమయంలోనే. ఎందుకంటే..పెళ్లికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమైనీ రావటంతో ఆయన పరపతి ఎంతన్నది ప్రపంచానికి అర్థమైంది.

2003లో ఇరాక్ ను ఆక్రమించిన తర్వాత సులేమానీపై అమెరికా టార్గెట్ పెట్టుకుంది. మధ్యలో కొన్ని పరిణామాల్లో సులేమానీతో కలిసేందుకు అమెరికా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే.. ఇరాక్ లో ఐదుగురు అమెరికా సైనికుల్ని బాంబు పేల్చి చంపినప్పుడు సులేమానీ పేరు మరోసారి తెర మీదకు వచ్చింది. ఇరాక్ లోని షియా మిలిటెంట్లకు బాంబుల తయారీని సులేమానీ నేర్పిస్తున్నట్లుగా ఆరోపనలు ఉన్నాయి. 2007లో అమెరికా జనరల్ డేవిడ్ పీట్రస్ కు నేరుగా హెచ్చరిక సందేశాన్ని పంపటం ద్వారా అగ్రరాజ్యానికి టార్గెట్ గా మారారు. అదే ఏడాది సులేమానీపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విదించింది.

2011లో సౌదీ దౌత్య సిబ్బంది హత్య కోసం మెక్సికన్ డ్రగ్స్ స్మగ్లర్లసాయం తీసుకున్నారన్న ఆరోపణ ఆయన మీద ఉంది. సిరియా యుద్ధంలో అసద్ కు మద్దతుగా ఆయన నిలిచారు. ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సైతం నేరుగా వార్నింగ్ ఇచ్చేశారు. మిస్టర్ ట్రంప్..మేం నీకు చాలా దగ్గరగా ఉన్నాం. ఆ ప్రదేశం నీ ఊహకు కూడా అందదు. నువ్వు యుద్ధం మొదలుపెడితే.. మేము యుద్ధాన్ని ముగిస్తామంటూ తీవ్ర వ్యాఖ్య చేయటం అమెరికాకు మరింత టార్గెట్ అయ్యాడు. పలుమార్లు ప్రాణగండాల్ని ఎదుర్కొని సురక్షితంగా బయటపడినప్పటికి ఇరాక్ లో అతన్ని టార్గెట్ చేసి మరీ అమెరికా చేసిన తాజా దాడిలో ఆయన హతమయ్యారు.

సులేమాన్ మీద కసిగా ఉన్న అమెరికాకు.. అతను బాగ్దాద్ ను రానున్న సమాచారాన్ని అందుకొని పక్కా ప్లాన్ తో లేపేశారు. ఎర్రటి రాయితో చేసిన ఉంగరాన్నిసులేమానీ ధరిస్తాడు. దాని ఆధారంగానే అతడు మరణించినట్లుగా నిర్దారించారు. తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్ లోని అమెరికన్లు వెనువెంటనే ఆ దేశాన్ని విడిచి పెట్టి ఇతర దేశాలకు వెళ్లాల్సిందిగా కోరింది.

ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అమెరికన్లు వెంటనే ఆ దేశం నుంచి బయటకు వచ్చేయాలని కోరింది. తమ టాప్ కమాండర్ ను వైమానిక దాడులతో హతమార్చిన అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరిస్తోంది. ప్రతీకారం తప్పదు.. అమెరికా చర్య దారుణమని ఇరాన్ పేర్కొంది. సులేమానీని హతమార్చటంపై ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. అమెరికా దాడిని కొన్ని దేశాలు సమర్థిస్తే..మరికొన్ని దేశాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.