Begin typing your search above and press return to search.

ప్రపంచ వ్యాప్తంగా పిశాచి వైరస్ మరణ మృదంగం..

By:  Tupaki Desk   |   19 March 2020 7:38 AM GMT
ప్రపంచ వ్యాప్తంగా పిశాచి వైరస్ మరణ మృదంగం..
X
అనుకున్నంతా జరిగింది. అప్రమత్తతో పిశాచి వైరస్ కు చెక్ పెట్టొచ్చన్న విషయం తెలిసినప్పటికీ.. తమకేం కాదన్న ధీమా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా? అన్న నిర్లక్ష్యం.. కరోనా తీవ్రతను తక్కువగా అంచనా వేయటం.. మొత్తంగా ప్రపంచం భారీ మూల్యాన్ని చెల్లిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా (కొవిడ్ -19) ప్రపంచానికి దడ పుట్టే స్థాయికి వెళ్లిపోయింది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచంలోని 163 దేశాల్లో ఈ మాయదారి వైరస్ జాడలుకనిపించినట్లుగా చెబుతున్నారు. బుధవారం నాటికి కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య ఏనిమిదివేలకు దాటిపోతే.. కరోనా లక్షణాలు కన్ఫర్మ్ అయిన వారి సంఖ్య ఏకంగా రెండు లక్షలు దాటటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

ఇప్పటివరకూ ఈ వైరస్ కారణంగా ఆసియాలో 3384 మంది మరణిస్తే.. అందులో సింహభాగం చైనాలోనే చోటు చేసుకున్నాయి. తాజాగా.. ఆసియాను దాటేసి.. యూరోప్ లో కరోనా కారణంగా చోటు చేసుకున్న మరణాలు సంఖ్య 3422కు చేరుకున్నాయి. యూరోప్ లోని పలు సంపన్న దేశాలు కరోనా ధాటికి కకవికలమవుతున్నాయి. దీన్ని ఎలా అరికట్టాలన్న విషయంపై తలలు బాదుకునే దుస్థితి. ప్రపంచమంతా కరోనా కారణంగా కిందామీదా పడుతుంటే.. ఈ వైరస్ కు మూలమైన చైనాలో బుధవారం కేవలం ఒకే ఒక్క కేసు మాత్రమే నమోదు కావటం గమనార్హం.

యూరోపియన్ యూనియన్ తమ దేశాల సరిహద్దుల్ని మూసేసింది. కొన్ని అత్యవసర వినతులతో కొన్ని దేశాలు సరిహద్దులు తెరిచినా అది తాత్కాలికమే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటలీలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. కరోనా విషయం ఏం చేయాలో ఇప్పుడా దేశానికి అస్సలు అర్థం కావట్లేదు. బుధవారం ఒక్కరోజులోనే ఆ దేశంలో కరోనా బారిన పడి ఏకంగా 475 మంది మరణించారు. దీంతో.. ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య మూడువేలకు (అధికారిక లెక్కల ప్రకారం 2978 మందిగా చెబుతున్నారు) చేరువలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇంత భారీగా మరణాలు చోటు చేసుకున్న దేశంగా ఇరాన్ ను చెప్పొచ్చు. ఇప్పటి వరకూ ఆ దేశంలో 1100 మంది మరణించగా.. మరో యూరోపియన్ దేశం స్పెయిన్ లో 600 మంది.. ప్రాన్స్లో 260 మంది మరణించారు. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలోనూ కరోనా కారణంగా 124 మంది మరణించగా.. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.

వైరస్ ను వ్యాప్తి కాకుండా ఉండేందుకు వీలుగా యూరోపియన్ యూనియన్ దేశాలు 30 రోజుల పాటు తమ దేశ సరిహద్దుల్ని మూసేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలో ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య 6500కు పెరిగింది. స్కైప్ ద్వారా వైద్యసేవల్ని వినియోగించుకోవాలని దేశాధ్యక్షుడు ట్రంప్ కోరారు. కనిపించని శత్రువుతో చేస్తున్న ఈ యుద్ధాన్ని గెలిచి తీరాల్సిందిగా ఆయన పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు న్యూయార్క్ వ్యాప్తంగా సామూహికంగా క్వారంటైన్ ప్రకటించే అవకాశం ఉందన్నారు. అదే చేస్తే.. న్యూయార్క్ మహానగరంలోని 86 లక్షల మంది పౌరుల్ని ఇళ్లల్లోనే నిర్బంధించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆసియా.. యూరప్ తో పాటు.. ఆఫ్రికా.. ఆస్ట్రేలియాలతో పాటు అన్ని దేశాల్లోనూ కరోనా ప్రభావం తీవ్రరూపం దాలుస్తోంది.