Begin typing your search above and press return to search.

ప్ర‌పంచంలోని ఏటీఎంల‌పై సైబ‌ర్ దాడికి స్కెచ్!

By:  Tupaki Desk   |   14 Aug 2018 2:30 PM GMT
ప్ర‌పంచంలోని ఏటీఎంల‌పై సైబ‌ర్ దాడికి స్కెచ్!
X
విన్నంత‌నే ద‌డ పుట్టించే భారీ సైబ‌ర్ దాడికి ప్లాన్ సిద్ధం చేసిన వైనం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌తంలో జ‌రిగిన వాన్నా క్రై సైబ‌ర్ దాడితో ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భారీఎత్తున న‌ష్ట‌పోయిన వైనం తెలిసిందే. ఈ సైబ‌ర్ దాడిలో కొన్ని దేశాల మీద పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. తాజాగా హ్యాక‌ర్లు భారీ ప్లాన్ ఒక‌టి రూపొందించిన వైనం ఎఫ్ బీఐ త‌న తాజా ర‌హ‌స్య నివేదిక‌లో పేర్కొన్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ ప్లాన్ ప్ర‌కారం ప్ర‌పంచంలోని బ్యాంక్ ఏటీఎంల‌పై ఒకేసారి దాడికి పాల్ప‌డి.. పెద్ద ఎత్తున న‌గ‌దును దోచేయాల‌న్న ప్లాన్ లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. మాల్ వేర్ ద్వారా బ్యాంక్ ఏటీఎంల‌లోకి చొర‌బ‌డి అందులోని భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ల్నినిర్వీర్యం చేసి కోట్లాది రూపాయిల్ని దోచుకునేలా ప్లాన్ చేసిన వైనం బ‌య‌ట‌కు పొక్కింది.

ఈ దుర్మార్గ‌మైన ఆప‌రేష‌న్ కు ఏటీఎం-క్యాష్ అవుట్ పేరుతో ప్లాన్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ భారీ కుట్ర నేప‌థ్యంలో ప్ర‌పంచంలోని ఆర్థిక సంస్థ‌ల‌కు ఎఫ్ బీఐ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. సైబ‌ర్ దాడి నుంచి ప్ర‌జ‌ల సొమ్మును ర‌క్షించేందుకు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొంది.

గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా హ్యాక‌ర్లు అమెరికా నేష‌న‌ల్ బ్యాంక్ ఆఫ్ బ్లాక్స్ బ‌ర్గ్ పై సైబ‌ర్ దాడికి పాల్ప‌డి దాదాపు 20.4 ల‌క్ష‌ల డాల‌ర్ల సొమ్మును దోచుకెళ్లారు ఓవైపు ఆధార్ స‌మాచారం భ‌ద్ర‌త‌పై సందేహాలు వ్య‌క్త‌మవుతున్న వేళ‌.. ఈ సైబ‌ర్ కుట్ర బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో మ‌న బ్యాంకులు ఎంత సీరియ‌స్ గా తీసుకుంటాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారిందని చెప్ప‌క త‌ప్ప‌దు.