Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ‘‘బావర్చి’’ హోటల్లో అంత ఆరాచకమా?

By:  Tupaki Desk   |   19 Nov 2019 5:52 AM GMT
హైదరాబాద్ ‘‘బావర్చి’’ హోటల్లో అంత ఆరాచకమా?
X
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న సామెతకు తగ్గట్లుగా వ్యవహరిస్తుంటాయి కొన్ని హోటళ్లు. ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఆహారపదార్థాల విషయంలో హోటల్ యజమానులు తమ లాభాలు.. ప్రయోజనాలు మాత్రమే చూసుకోవటం తప్పించి.. కస్టమర్ల గురించి ఆలోచించే వాటి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లు.. రెస్టారెంట్లలో తనిఖీలు చేసే మున్సిపల్ సిబ్బంది షాకింగ్ నిజాల్ని వెల్లడిస్తున్న వైనం తెలిసిందే.

తాజాగా అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహిస్తున్న మన నగరం - మన ప్రణాళికలో భాగంగా పలు హోటళ్లను తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఫీర్జాదిగూడ పరిధిలోని పర్వతాపూర్ రోడ్డులో ఉన్న బావర్చి హోటల్ లో కుళ్లిన ఆహార పదార్థాల్ని గుర్తించారు.

పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటమే కాదు.. నాణ్యమైన ఆహారాన్ని అందించే విషయంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రూ.10వేల జరిమానాను విధించారు. పేరుకు బావర్చి అయినా.. ఆ పేరుకు తగ్గ నాణ్యత లేని ఆహారం.. కుళ్లిన వంట సామాగ్రిని చూసినప్పుడు.. ఎంచుకునే హోటల్ విషయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.