Begin typing your search above and press return to search.

ధోనీ రికార్డులు సరే.. చాంపియన్ సీఎస్ కే దారుణ ప్రదర్శన సంగతేంటి..?

By:  Tupaki Desk   |   4 April 2022 8:00 AM GMT
ధోనీ రికార్డులు సరే.. చాంపియన్ సీఎస్ కే దారుణ ప్రదర్శన సంగతేంటి..?
X
టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టి20ల్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆదివారం నాటి పంజాబ్‌ కింగ్స్ తో మ్యాచ్‌ ధోనీకి 350వ టి20. వీటిలో 98 ఇంటర్నేషనల్, 223 మ్యాచ్‌లు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. మిగతా మ్యాచ్‌లు ఛాంపియన్స్‌ లీగ్‌వి.మరోవైపు ధోనీ టీ20ల్లో ఏడువేల పరుగులు చేశాడు. ఇంటర్నేషనల్ సహా లీగ్‌ల్లో ధోనీ కంటే ముందున్న ఆటగాడు ముంబై ఇండియన్స్, టీమిండియా సారథి రోహిత్ శర్మ (372). చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా (336), దినేశ్‌ కార్తిక్ (329), విరాట్ కోహ్లీ (328) తర్వాతి స్థానాల్లో ఉన్నారు .రైనా ను ఈసారి ఏ జట్టూ తీసుకోలేదు. కార్తిక్, కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నారు. ఈ సీజన్‌లో ఫైనల్‌ సహా అన్ని మ్యాచ్‌లను ఆడితేనే వీరు 350 మ్యాచ్ లకు చేరుకుంటారు. అయితే, ధోని మరో 2 సిక్స్లు కొడితే.. టీ-20 క్రికెట్లో చెన్నై ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో తొలి స్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం ధోనీ 218 సిక్స్లతో ఉన్నాడు. ఇందులో 192 ఐపీఎల్లో చెన్నై తరఫున, మరో 26 ఛాంపియన్స్ లీగ్లో కొట్టాడు.

రైనా 219 సిక్స్లతో చెన్నై తరఫున తొలి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా చూస్తే ధోనీ టాప్-5లో ఉన్నాడు. విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 263 సిక్స్లతో(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) టాప్లో ఉన్నాడు. కీరన్ పొలార్డ్ 249 సిక్స్లు(ముంబై ఇండియన్స్), ఏబీ డివిలియర్స్ 240 సిక్సర్లు(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), విరాట్ కోహ్లీ 226 సిక్సర్లు(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 3 సిక్సర్లు బాదితే.. టీ20 క్రికెట్లో రాస్ టేలర్ను కూడా అధిగమించి అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో 27వ స్థానానికి చేరుకుంటాడు. ఇప్పటివరకు టీ20ల్లో ధోనీ 349 మ్యాచ్లు ఆడి.. 307 సిక్స్లు బాదాడు. కాగా, ఆదివారం పంజాబ్ తో మ్యాచ్ లో ధోనీ ఒక్క సిక్సే కొట్టాడు. 28 బంతుల్లో 23 పరుగులు చేసిన ధోనీ.. గెలిపిస్తాడనుకున్న దశలో ఔటయ్యాడు. ప్రస్తుత సీజన్లో తొలి మ్యాచ్లో కోల్కతాపై 50, లక్నోతో ఆఖర్లో వచ్చి 6 బంతుల్లోనే 16 పరుగులతో రాణించాడు. రెండింట్లోనూ నాటౌట్ గా మిగిలాడు.

దారుణంగా సీఎస్కే ప్రదర్శన

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ లో సీఎస్కే దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. పంజాబ్ తో మ్యాచ్ లో ఓటమితో సీఎస్కే హ్యాట్రిక్ నమోదు చేసింది. తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తయిన చెన్నై.. రెండో మ్యాచ్ లో 210 పరుగులు చేసి కూడా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం ఎదుర్కొంది. సీజన్ ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు చెన్నై కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోగా.. రవీంద్ర జడేజా కొత్త సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

అయితే, ఆల్ రౌండర్ గా సూపర్ ఫామ్ లో ఉన్న జడేజా లీగ్ లో మాత్రం చెన్నైను నడిపించలేకపోతున్నాడు. ముఖ్యంగా సురేశ్ రైనా లేని లోటు కనిపిస్తోంది. బౌలింగ్ లో దీపక్ చహర్ దూరం కావడం మరో పెద్ద దెబ్బ. డుప్లెసిస్ ను రిటైన్ చేసుకోకపోవడం.. రిటైన్ చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్ దారుణ వైఫల్యం మరింత కుంగదీస్తోంది.

వెటరన్లే భారమై..

చెన్పై ముద్దు పేరు "డాడీస్ ఆర్మీ". వెటరన్ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నందున చెన్నైని అలా పిలుస్తుండేవారు. అయితే, వారంతా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయ ప్రస్థానంలో కీలకంగా నిలిచేవారు. వాట్సన్, బ్రావో, డుప్లెసిస్, ధోని, రాయుడు, ఉతప్ప.. ఇలా అందరూ పెద్ద వయసు వారే చెన్నైకి ఆడేవారు. కానీ, చక్కటి ప్రదర్శనతో విజేతగా నిలిపేవారు. కానీ, ఈసారి ఆ పాచిక పారడం లేదు.

ధోని ఫామ్ ఫర్వాలేకున్నా.. రాయుడు, బ్రావో ప్రభావం చూపడం లేదు. ఉతప్ప రాణించినా ఉపయోగం లేకపోయింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు 54 పరుగుల తేడాతో ఓటమిపాలై.. టోర్నీ చరిత్రలోనే పరుగుల పరంగా రెండో అతిపెద్ద ఓటమిని చవిచూసింది. దీంతో అభిమానులు ఆ జట్టు ఆటతీరును ఎండగడుతున్నారు. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగితే డిఫెండింగ్ చాంపియన్ ముందుకెళ్లడం కష్టమే.