Begin typing your search above and press return to search.

మొన్న ఘన రికార్డు.. నేడు చెత్త రికార్డు ఫడ్నవీస్ సొంతం

By:  Tupaki Desk   |   27 Nov 2019 4:39 AM GMT
మొన్న ఘన రికార్డు.. నేడు చెత్త రికార్డు ఫడ్నవీస్ సొంతం
X
తప్పు చేసి తప్పించుకోవటం అందరికి సాధ్యమయ్యేది కాదు. అలా జరగాలంటే కాసింత అదృష్టం కూడా రాసి పెట్టి ఉండాలేమో? మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఎదురైన ఇబ్బందికర పరిస్థితే దీనికి నిదర్శనంగా చెప్పక తప్పదు. మొన్నటికి మొన్న అరుదైన ఘనత సాధించిన నేతగా ఫడ్నవీస్ పేరుతో ఒక రికార్డును నెలకొల్పిన ఆయన నాలుగు రోజులు తిరిగేసరికి అత్యంత చెత్త రికార్డు ఆయన సొంతం కావటం చూస్తే.. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అన్న సామెత గుర్తు రాక మానదు.

మహారాష్ట్ర చరిత్రలో ఐదేళ్లు నిరాటంకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రికార్డు మాత్రమే కాదు.. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అరుదైన రికార్డు దేవేంద్ర ఫడ్నవీస్ పేరిట నమోదైంది. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న నేతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అయితే.. ఆ ఆనందం నాలుగు రోజులు మాత్రమే మిగిలింది. ఎందుకంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో అతి చెత్త రికార్డు అతని పరమైంది.

మహారాష్ట్రలో అత్యంత తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు ఫడ్నవీస్ పేరుతో నమోదైంది. ఇంతకు ఈ రికార్డు మాజీ సీఎం పీకే సావంత్ పేరు మీద ఉండేది. ఎందుకంటే మహారాష్ట్రకు అత్యంత తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పీకే సావంత్ పని చేశారు. కేవలం తొమ్మిది రోజులే సీఎంగా వ్యవహరించారు. తాజాగా ఆ రికార్డును చెరిపేసి సావంత్ కంటే ఐదు రోజులు తక్కువగా.. కేవలం నాలుగు రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పని చేసిన చెత్త రికార్డు ఈ బీజేపీ నేత పేరు మీద నమోదైంది.

మోడీషాలు వేసిన ఎత్తులతో ఫడ్నవీస్ పరిస్థితి ఇలా ఉంటే.. అప్పట్లో సావంత్ తొమ్మిది రోజులు మాత్రమే సీఎంగా ఎందుకు వ్యవహరించారన్నది చూస్తే.. 1963లో అప్పటి సీఎం మరాఠ్ రావు కన్నమ్ వార్ ఆకస్మికంగా మరణించటంతో ఆయన స్థానంలో సావంత్ ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. కేవలం తొమ్మిది రోజులు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తే.. తాజాగా ఆ రికార్డును ఫడ్నవీస్ బ్రేక్ చేశారు. అరుదైన ఘనత సాధించిన రికార్డును సొంతం చేసుకున్న ఫడ్నవీస్ ఇప్పుడు అత్యంత చెత్త రికార్డును తన పేరుతో చూసుకోవాల్సిన పరిస్థితి. తాను చేసిన కక్కుర్తి పని ఆయనకు తరచూ గుర్తు చేసేలా తాజా రికార్డు ఉంటుందని చెప్పక తప్పదు.