Begin typing your search above and press return to search.

జగన్ పాదయాత్రను బాబు అడ్డుకుంటే సీఎం అయ్యేవారా...?

By:  Tupaki Desk   |   25 Aug 2022 12:30 PM GMT
జగన్ పాదయాత్రను బాబు అడ్డుకుంటే సీఎం అయ్యేవారా...?
X
ఇది నిజంగా సూటి ప్రశ్నగానే చూడాలి. ప్రజాస్వామ్యంలో ఒకరిని ఒకరు నిలువరించాలంటే కుదిరే పని కాదు. ప్రజలు వద్దు అనేంతవరకూ ఎవరైనా రేసులో ఉన్నట్లే. ఇక అధికారాలు అన్నవి ఎపుడూ శాశ్వతాలు కావు. మరి అన్నీ తెలిసి కూడా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ విపక్షం విషయంలో ఎందుకు ఉక్కు పాదం మోపుతోంది అన్నదే చర్చగా ఉంది. విపక్షాలు జనాల దగ్గరకు వెళ్లడం అన్నది సాధారణమైన విషయం.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన కుప్పానికి ఎమ్మెల్యే. ఇప్పటికి ఏడు సార్లు గెలిచారు. తన నియోజకవర్గంలో పర్యటించే హక్కు ఆయనకు ఉంది. బాబు అలా మూడు రోజుల ట్రిప్ పెట్టుకున్నారు. ఆయన మానాన ఆయన్ని వదిలేస్తే ఏదో టూర్ చేసి వెళ్ళిపోయేవారు. ఇక చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏమైనా జగన్ పాలన బాగుంది అంటారా. విమర్శలు చేస్తారు అయితే అందులో నిజానిజాలు ఏపాటివో జనాలు అర్ధం చేసుకుంటారు.

అలా జనానికి వదిలేయాల్సిన బాబు కుప్పం టూర్ విషయంలో వైసీపీ అతి చేసింది అన్నదైతే ఇపుడు అంతటా వినిపిస్తున్న మాట. అన్న క్యాంటీన్ ని బాబు ప్రారంభిస్తారు అనుకుంటే అక్కడ వైసీపీ వాళ్ళు వెళ్ళి ద్వంసం చేయడమేంటి. ఇక బాబు టూర్ లో వైసీపీ నేతలకు ఏమిటి పని. చంద్రబాబు మీటింగులలో ఎటూ జగన్ని వైసీపీని విమర్శిస్తారు. మరి దాన్ని భరించే ఓపిక లేకపోతే ప్రజాస్వామ్య స్పూర్తి ఎలా ఉంటుంది.

మరో వైపు చూస్తే చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ ఉన్న నాయకుడు. ఆయన టూర్ సవ్యంగా సాగకపోతే ఆ తప్పు ఆయనది కాదు, ప్రభుత్వాన్ని ఏలుతున్న వైసీపీదే అని అంతా అంటారు. ఒక విపక్ష నాయకుడి మాజీ ముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేని ప్రభుత్వం అని విమర్శిస్తారు. ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడిది అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది.

కుప్పంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు వైసీపీని పరువు తీసేవే అని అంటున్నారు. అసలు బాబు టూర్ విషయంలో వైసీపీ ఎందుకు అంత అతి ఉత్సాహం చూపించింది అన్నదే ఎవరికీ అర్ధం కాని విషయం. వైసీపీ వైపు చూస్తే తమను టీడీపీ వారు రెచ్చగొట్టారు అని అంటున్నారు. రెచ్చిపోయినా లేక తిరిగి దాడి చేసినా టీడీపీకే అది రాజకీయ లాభం అని తెలియనంత అమాయకత్వంలో వైసీపీ నేతలు ఉన్నారా అన్నది డౌట్.

బాబు టూర్ లో ఇలాంటివి ఏమైనా జ‌రుగుతాయని ముందే తెలిస్తే ప్రభుత్వం తన పరంగా ఎందుకు భారీ పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయలేదు అన్నది కూడా కీలకమైన ప్రశ్న. అదే విధంగా బాబు టూర్ ని అడ్డుకున్నారు అన్న అపకీర్తిని ఎందుకు వైసీపీ మోయాల్సి వస్తోంది అన్నది కూడా సమీక్ష చేసుకోవాలి. ఇక్కడ మరో ప్రశ్న కూడా జనాల నుంచి వస్తోంది.

ఆనాడు జగన్ ఏకంగా మూడువేల ఏడు వందలకు పైగా కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేశారు. మరి నాడు బాబు సీఎం గా ఉన్నారు. ఆయన కనుక తలచుకుంటే పోలీసులను తమ పార్టీ వారిని పంపించి ఎక్కడికక్కడ జగన్ పాదయాత్రను అడ్డుకుంటే ఆయన పాదయాత్ర చేసేవారా అన్నది కూడా ఇక్కడ జనాలకు వస్తున్న సందేహం. ఈ మొత్తం వ్యవహారంలో బాబుని ఏదో చేద్దామనుకుని బదనాం అవుతోంది వైసీపీ అని ఎందుకు గ్రహించడంలేదు అన్నదే పెద్ద ప్రశ్న.

ఇక కుప్పంలో అన్నీ గెలిచేశామనుకుని వైసీపీ వీరంగం వేసినా చంద్రబాబు 2024 దాకా ఎమ్మెల్యేగా ఉంటారు. ఆయన వచ్చీ పోతూ ఉంటారు. అంతే కాదు. రేపటి రోజున ఏ పార్టీ నాయకుడు అయినా ఎక్కడ అయినా పర్యటించవచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ అలా జరగకూడదు అంటే ప్రభుత్వమే చెడ్డ మూటకట్టుకుంటుంది.

ఏది ఏమైనా కుప్పం లో గతంలో కూడా బాబు పర్యటించారు. వెళ్లారు, కానీ ఈసారి బాబు టూర్ హైలెట్ అయింది. టీడీపీకి సానుభూతి పెరిగింది. వైసీపీ సర్కార్ దమననీతి మీద కూడా చర్చ సాగుతోంది అంటే అది కేవలం కుప్పంతోనే ఆగుతుందా లేదా అన్నది వైసీపీ వారు చూసుకోవాలి. ఇదే తమ పాలన అని జనాలకు వారు చెప్పుకుంటే మాత్రం ప్రజలు ఇచ్చే తీర్పునకు కూడా వెయిట్ చేయాల్సిందే.