Begin typing your search above and press return to search.

న్యాప్కిన్ పోలిక‌తో అర్థ‌మ‌య్యేలా చెప్పిన స్మృతి!

By:  Tupaki Desk   |   24 Oct 2018 5:16 AM GMT
న్యాప్కిన్ పోలిక‌తో అర్థ‌మ‌య్యేలా చెప్పిన స్మృతి!
X
శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ద‌ర్శ‌నం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ల‌క్ష‌లాది మంది భ‌క్తులు తీవ్రంగా వ్య‌తిరేకించ‌టం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మ‌ళ్లీ స‌మీక్షించాల‌న్న డిమాండ్ పెద్ద ఎత్తున వ‌చ్చింది. మొద‌ట్లో దీనిపై సుప్రీం రియాక్ట్ కాకున్నా.. తాజాగా తాము ఇచ్చిన తీర్పును మ‌రోసారి స‌మీక్షించుకునే దిశ‌గా.. అయ్య‌ప్ప ఆల‌యంలో మ‌హిళ‌ల ద‌ర్శ‌నంపై దాఖ‌లైన పిటిష‌న్ల‌ను విచారించేందుకు ఓకే చేసింది.

ఇదే స‌మ‌యంలో కోర్టు తీర్పును ప్ర‌స్తావించ‌కుండానే.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల ద‌ర్శ‌నం ఎంత త‌ప్ప‌న్న విష‌యాన్ని ఒక ఉదాహ‌ర‌ణ‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ. ప్రార్థ‌న హ‌క్కు ఉన్నంత‌నే.. దాన్ని అప‌విత్రం చేయ‌టానికి హ‌క్కు ఉన్న‌ట్లు కాదంటూ ఆమె ఒక పోలిక‌ను చెప్పారు.

రుతుస్రావంతో త‌డిచిన న్యాప్కిన్స్ తో స్నేహితుల ఇళ్ల‌కే వెళ్ల‌మ‌ని.. అలాంటిది దేవాల‌యంలోకి ఎలా వెళ్తామంటూ ఆమె వ్యాఖ్యానించారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా మ‌హిళ‌ల‌ను శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో ల‌క్ష‌లాది మంది చేస్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో స్మృతి వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

అంతేకాదు.. త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌ను ఆమె ప్ర‌స్తావించారు. తాను హిందువునైనా జొరాస్ట్రియ‌న్‌ను పెళ్లి చేసుకున్నాన‌ని.. త‌న పిల్ల‌ల్ని ఇద్ద‌రిని జొరాస్ట్రియ‌న్లుగానే పెంచుతున్న‌ట్లు ఆమె చెప్పారు. తాను దేవాల‌యానికి వెళ్తాన‌ని.. త‌న భ‌ర్త‌.. పిల్ల‌లు అగ్ని ఆల‌యానికి వెళ‌తార‌ని.. తాను ఆ మ‌త విశ్వాసాల్ని.. సంప్ర‌దాయాల్ని పాటిస్తూ తాను లోప‌ల‌కు వెళ్ల‌న‌ని వెల్ల‌డించారు.

జొరాస్ట్రియ‌న్ల సంప్ర‌దాయాల్ని.. న‌మ్మ‌కాల్ని గౌర‌విస్తూ త‌న భ‌ర్త‌.. పిల్ల‌లు గుడికి వెళితే తాను మాత్రం కారులో ఉంటాన‌ని.. లేదంటే రోడ్డు మీద నిలుచుంటాన‌ని ఆమె చెప్పారు. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ద‌ర్శ‌న ప‌రిమితుల్ని గౌర‌వించాల్సిన అవ‌స‌రాన్ని.. న‌మ్మ‌కాల‌కు త‌గ్గట్లు న‌డుచుకోవ‌టం అవ‌స‌ర‌మ‌న్న విష‌యాన్నిస్మృతి త‌న ఉదాహ‌ర‌ణ‌తో చెప్ప‌క‌నే చెప్పార‌ని చెప్పాలి.