Begin typing your search above and press return to search.

యూపీలోని ఆ జిల్లా చేసినట్లే చేస్తేనా సెకండ్ వేవ్ ఉండేది కాదేమో?

By:  Tupaki Desk   |   2 Jun 2021 12:30 PM GMT
యూపీలోని ఆ జిల్లా చేసినట్లే చేస్తేనా సెకండ్ వేవ్ ఉండేది కాదేమో?
X
కరోనా మొదటి వేవ్ వేరు. ఎందుకంటే.. చీకట్లో దారి వెతుక్కుంటూ వెళ్లటం లాంటిది. కానీ మొదటి వేవ్ తగ్గేసరికి కరోనా వైరస్ తో బాధ పడే వారికి సంబంధించి ఎలాంటి కేసుకు ఎలాంటి మందులు వాడొచ్చు? ఏం చేయొచ్చ? ఏం చేయకూడదు? అన్న విషయంపై చాలానే క్లారిటీ వచ్చింది. అంటే చీకట్లో ఉత్త చేతులతో వెళ్లకుండా ఒక కర్ర.. ఒక టార్చిలైట్ లాంటివి సమకూర్చుకున్నట్లే చెప్పాలి. అలాంటివేళలో.. సెకండ్ వేవ్ సమయానికి మరింత కట్టుదిట్టంగా పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసి ఉంటే.. సెకండ్ వేవ్ శోకం దేశాన్ని అంతలా ఊపేసేది కాదు.

ఆక్సిజన్ సిలిండర్ల కోసం పరుగులు తీయటం.. ఆసుపత్రుల్లో బెడ్లు లేక రోడ్ల మీదనే ఆక్సిజన్ పెట్టి వైద్యం కోసం నిరీక్షించటం.. ఆసుపత్రిలో బెడ్లు లేక.. వైద్యం కోసం వెయిట్ చేస్తూనే ప్రాణాలు కోల్పోయిన ఎన్నో విషాదకర ఉదంతాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వ్యాక్సిన్ చేతిలో ఆయుధంలా ఉంది. అయినప్పటికి దాన్ని వినియోగించుకునే విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఎన్నో ప్రాణాలు పోవటానికి.. లక్షలాది మంది వైరస్ బారిన పడటానికి కారణమైందని చెప్పాలి.

ఇంట్లో ఉన్న వ్యాక్సిన్ ను వీధిలో ఉన్నోడికి ఇచ్చేందుకు చూపించిన చొరవలో పది శాతం.. దేశంలోని వ్యాక్సినేషన్ మీద చూపించి ఉంటే.. సెకండ్ వేవ్ తీవ్రత ఇంతలా ఉండేది కాదు. ఉద్యమస్ఫూర్తితో టీకాలు వేయించి ఉంటే వేలాది కుటుంబాలు ఇప్పుడు ఎదుర్కొంటున్న శోకం దరికి చేరేది కాదేమో? ఇదంతా ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ కు సంబంధించి అక్కడి యంత్రాంగం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని.. టీకా వేయించుకోకుంటే నెల జీతం ఇచ్చేది లేదని జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ మౌఖిక ఆదేశాలు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కొవిడ్ టీకా వేయించుకోకపోతే.. సదరు ఉద్యోగిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవటంతో పాటు మే జీతాన్ని నిలిపివేసేలా ఆయన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి ఇదే నిర్ణయాన్ని టీకా అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే అమలు చేసి ఉంటే.. ఈపాటికి వ్యాక్సినేషన్ గణనీయంగా నమోదు కావటమేకాదు.. సెకండ్ వేవ్ తీవ్రత ఇంతలా ఉండేది కూడా కాదేమో? ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ఇదే బాటలో నడిచి ఉంటే.. ఎన్నో విషాదకర ఉదంతాలు చోటు చేసుకునేవి కావేమో కదా?