Begin typing your search above and press return to search.

దేశం కోసమేనా ఈ ‘ప్రత్యేక’ బాదుడు మోడీజీ?

By:  Tupaki Desk   |   21 March 2021 4:34 AM GMT
దేశం కోసమేనా ఈ ‘ప్రత్యేక’ బాదుడు మోడీజీ?
X
వీపు విమానం మోత వచ్చేలా బాదాలి. అయినా.. కిమ్మనకుండా ఉండాలి. అదెలా సాధ్యమంటారా? సాధ్యమే.. దాని గుట్టు తెలుసుకోవాలంటే కాసింత నిశితంగా పరిశీలిస్తే విషయం ఇట్టే అర్థమైపోతుంది. తాను ప్రధాని కుర్చీలో కూర్చుంటే చాలు.. బొమ్మ చూపిస్తానని చెప్పిన మోడీ.. నిజంగానే బొమ్మ చూపిస్తున్నారు. దేశ ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రైల్వేలను తనకు తగినట్లుగా నియంత్రించి.. ప్రత్యేక రైళ్ల పేరుతో ఛార్జీల బాదుడుకు తెర తీసిన మోడీ తెలివికి జోహార్లుగా చెప్పాలి.

మోడీని విమర్శిస్తే చాలు.. దేశ ద్రోహానికి పాల్పడినట్లుగా ఆయన పరివారం అదే పనిగా హెచ్చరిస్తుంటారు. రైలు చార్జీల్ని పెంచకుండా.. ప్రత్యేక రైళ్ల పేరుతో నిర్వహిస్తూ భారీగా బాదేస్తున్నారు. అదేమంటే.. రెగ్యులర్ రైళ్లు లేకపోవటంతో.. కిందా మీదా పడి ఈ ప్రత్యేక రైళ్లలోనే ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో.. ఛార్జీల భారం భారీగా పెరిగిపోయిన దుస్థితి. తాజాగా కేంద్రమంత్రి చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఈ ధరల పెరుగుదల నాలుగు నెలలకే పరిమితమా? అన్న స్పష్టతను ఇవ్వలేదు.

రైలు ప్రయాణానికి సంబంధించి పలు వర్గాల వారికి రాయితీల మీద ప్రయాణించే వీలు కల్పిస్తుంటారు. సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీతో ప్రయాణం చేసే వీలుంది. కరోనాకు ముందు సీనియర్ సిటిజన్లు అయిన ఇద్దరు దంపతులు ఏసీ త్రీ టైర్ లో సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ప్రయాణించటానికి రూ.2105 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ప్రత్యేక రైళ్లకు రాయితీ ఎత్తేయటంతో ఆ ఖర్చు కాస్తా రూ.4240గా మారింది. దేశం కోసం.. అందునా మోడీలాంటి ప్రధాని ఉన్నప్పుడు పెద్ద వయస్కులు ఆ మాత్రంచెల్లించుకోలేరా? అని అనుకొని ఉండొచ్చు. రైల్వే శాఖ దుర్మార్గం ఏమంటే.. రెగ్యులర్ రైళ్లను ప్రత్యేక రైళ్లుగా మార్చేసి తిప్పుతున్నారు. అందుకు పూర్తి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రత్యేకం పేరుతో మోడీ మాష్టారి ప్రభుత్వం బాదేస్తున్న తీరు ఎలా ఉందో అర్థమైందా? ఇప్పటికి దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా? అంటే.. మాట్లాడిందేమీ లేదు.