Begin typing your search above and press return to search.

చొక్కా పసుపు.. కండువా వైపీసీ..: వావ్ వాట్ ఏ పొలిటిక్స్..

By:  Tupaki Desk   |   14 April 2021 9:37 AM GMT
చొక్కా పసుపు.. కండువా వైపీసీ..: వావ్  వాట్ ఏ పొలిటిక్స్..
X
‘ఇంట గెలిచి రచ్చ గెలువమంటారు’ పెద్దలు.. కానీ ఏపీ టీడీపీకి ఇంట్లోనే కుంపటి ఆరడం లేదు. ఇక బయటకెళ్లి ఏమి సాధిస్తుంది..? అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. సొంత పార్టీ నాయకులను గాడిలో పెట్టకుండా ఎదుటి పార్టీ మీద విమర్శలు చేస్తే ఉన్న పరువు పోవుడే తప్ప ఏం లాభం లేదని విమర్శిస్తున్నారు. ముందుగా పార్టీని గాడిలో పెట్టిన తరువాత ఇతరుల గురించి ఆలోచించాలని సలహాలు ఇస్తున్నారు. అయితే వీళ్లన్నమాటలు నిజమో కాదోనని అనుకుంటున్న తరుణంలో కొందరు టీడీపీ నాయకులు చేస్తున్న పని మాత్రం ఆ మాటలకు బలం చేకూరేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీలోని కొందరు నాయకులు ఇటు సపోర్టు చేస్తూనే.. మరోవైపు అధికార పార్టీకి అండగా నిలబడుతున్నారు..

ఏపీలోని ప్రకాశం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా క్లీన్ స్వీప్ చేసింది. 2019లోనూ కొన్ని చోట్ల గెలుపొందింది. అయితే రాను రాను పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుండడంతో కింది స్థాయి నాయకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొందరు మాత్రం తెలివిని ప్రదర్శిస్తున్నారు. రెండు కాళ్లపై రెండు పడవలు నడుపుతూ ఒకటి పోతే మరొకటి అన్నట్లుగా సాగుతున్నారు. ‘అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు’ అన్నట్లుగా ఏ పార్టీని వీడకుండా రెండూ మెయింటేన్ చేస్తున్నారు.

పక్కా టీడీపీ నేత అయిన ఒకతను ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే తరుఫున వచ్చాడు. ఆయన రక్తంలో కూడా ఎర్రరక్తకణాలు కావు అంట. అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి ఎమ్మెల్యే పంచన చేరి అధికారం చెలాయిస్తున్నాడంట.. ఇదీ టీడీపీ భక్తుల పరిస్థితి అని సెటైర్లు పడుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వెంట తిరుగుతున్న ఓ టీడీపీ నేత ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ నాయకుడు టీడీపీ పార్టీ చొక్కా(పసుపు చొక్కా) వేసుకున్నాడు. మెడలో మాత్రం వైసీపీ కండువా వేసుకున్నాడు. ఈయనను చూసిన వారంతా టీడీపీ నాయకుడా..? లేక వైసీపీ మెంబరా..? అని ఆశ్చర్యపోతున్నారట.

ప్రకాశం జిల్లాలో కొంతమేర టీడీపీకి సానుభూతి ఉంది. వైసీపీకి అధికారం ఉంది. అందువల్ల ప్రజల సానుభూతి కోసం ఎల్లోషర్ట్, అధికార పార్టీతో ఉన్నానని వైసీపీ కండువా వేసుకొని తిరుగుతున్నారు. ఇలా ఆ వ్యక్తే కాకుండా మరికొందరు ఇలాంటి పనే చేస్తున్నారట.

పార్టీల అధినేతలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం క్రాస్ చెక్ చేసి ఇంటెలిజెంట్స్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారట. దీంతో ఇలాంటి వాళ్ల గురించి బయటకొస్తున్నట్లు సమాచారం. పైకీ తాము ఆ పార్టీ, ఈ పార్టీ నాయకులమని చెబుతున్నా రెండింటిలో కొనసాగుతూ అధిక ప్రయోజనాలు పొందుతున్నారట. ఏదీ ఏమైనా ఇలాంటి రాజకీయం కూడా కొత్తగా ఉందని అనుకుంటున్నారు. అయితే రాను రాను అందరూ ఇలా చేస్తే అధికారంలో ఏ పార్టీ ఉందో తెలియక సామాన్యులు అయోమయానికి గురవుతారని అంటున్నారు.