Begin typing your search above and press return to search.

రెజ్లర్ హత్యకేసు: గర్ల్ ఫ్రెండ్ కోసమేనా?

By:  Tupaki Desk   |   10 Jun 2021 10:30 AM GMT
రెజ్లర్ హత్యకేసు: గర్ల్ ఫ్రెండ్ కోసమేనా?
X
రెజ్లర్ సాగర్ రానా హత్యకేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు కారణం ఇంటి అద్దె కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడు సాగర్ స్నేహితుడు సోనూ గర్ల్ ఫ్రెండ్ కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఈ హత్య ఎలా జరిగిందనేది పోలీసులు ఇలా చెబుతున్నారు.

రెజ్లర్ సుశీల్ కుమార్ కు చెందిన దిల్లీలోని ఓ మోడల్ టౌన్ ఫ్లాట్ లో సాగర్ అద్దెకు ఉండేవాడు. ఈ ఫ్లాట్ విషయంలో సాగర్ కు సుశీల్ మిత్రుడు అజయ్ కు పలుసార్లు ఘర్షణలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫ్లాట్ ఖాళీ చేయాలని అజయ్ కోరినట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత మార్చిలో స్నేహితుడు సోనూ పుట్టినరోజు వేడుకలను తన ఫ్లాట్ లో జరపాలని సాగర్ నిర్ణయించుకున్నాడని వెల్లడించారు.

సోనూ పుట్టిన రోజు వేడుకలకు అతడి గర్ల్ ఫ్రెండ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకున్నారని అన్నారు. ఆ సమయంలో అజయ్ ఫ్లాట్ కు వచ్చినట్లు పేర్కొన్నారు. సోనూ గర్ల్ ఫ్రెండ్ తో అజయ్ అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సాగర్, సోనూలు అజయ్ తో వాగ్వాదానికి దిగినట్లుగా వివరించారు.

ఈ ఘర్షణ సమాచారం సుశీల్ కు చేరింది. కాగా సాగర్, సోనూను బలవంతంగా స్టేడియానికి తీసుకొచ్చి సుశీల్ గ్యాంగ్ వారిపై దాడి చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన సాగర్ మే 4న ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. అయితే ముందు నుంచి చెబుతున్నట్లు ఈ ఘటనకు అద్దె కారణం కాదని పోలీసులు అంటున్నారు. సోనూ గర్ల్ ఫ్రెండ్ వల్లే జరిగిందని చెబుతున్నారు.