Begin typing your search above and press return to search.

బీజేపీలోకి 'దంగల్' బబితా ఫోగట్...

By:  Tupaki Desk   |   12 Aug 2019 1:49 PM GMT
బీజేపీలోకి దంగల్ బబితా ఫోగట్...
X
ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుని కేంద్రంలో రెండో సారి పాగా వేసిన బీజేపీ..ఇంకా దూకుడు ప్రదర్శిస్తుంది. ఒకవైపు ట్రిపుల్ తలాక్ బిల్ - ఆర్టికల్ 370 రద్దు తదితర బిల్లులని అటు రాజ్యసభలో - ఇటు లోక్ సభలో భారీ మెజారిటీలతో ఆమోదించుకుని దూసుకెళుతుండగా - మరోవైపు బలహీనంగా రాష్ట్రాల్లో నాయకులని చేర్చుకుంటూ బలపడే దిశగా వెళుతుంది. అలాగే పలువురు స్టార్ నటులు - క్రీడాకారులు బీజేపీ పట్ల ఆకర్షితులై అందులో చేరుతున్నారు.

మొన్న ఎన్నికలకు ముందు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరి ఢిల్లీ నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందే భోజ్‌ పురి న‌టుడు మ‌నోజ్ తివారి సైతం బీజేపీలో చేరి ఢిల్లీ ఎంపీగా గెలిస్తే - రేసుగుర్రం విల‌న్ ర‌వికిష‌న్ సింగ్ బీజేపీ నుంచి ఘోర‌క్‌ పూర్ ఎంపీగా గెలిచి పార్ల‌మెంటులో అడుగుపెట్టారు.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ రెజ్లర్‌ బబితా ఫొగాట్‌ - ఆమె తండ్రి మహావీర్‌ సింగ్‌ ఫొగాట్‌ సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర క్రీడల కిరణ్ రిజుజు సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. మహావీర్‌ సింగ్‌ ఫొగాట్‌ - ఆయన కూతుళ్ల జీవితకథ ఆధారంగా అమిర్‌ ఖాన్‌ 2016లో ‘దంగల్‌’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇక 29 ఏళ్ల బబిత అర్జున అవార్డు గ్రహీత. ప్రస్తుతం హర్యానాలో పోలీస్ ఇన్‌ స్పెక్టర్‌ గా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన నేపథ్యంలో ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవల ఆర్టికల్ 370 రద్దుని సమర్ధించిన ఆమె...ఇక అందమైన కశ్మీరి యువతులని పెళ్లి చేసుకోవచ్చన్న హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలని కూడా సమర్ధించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరిలో హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బబిత బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. బబిత చేరికతో హర్యానాలో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.