Begin typing your search above and press return to search.

యంగ్ క్రికెటర్ కు బీసీసీఐ గట్టి ఝలక్!

By:  Tupaki Desk   |   2 Oct 2019 4:25 AM GMT
యంగ్ క్రికెటర్ కు బీసీసీఐ గట్టి ఝలక్!
X
మొన్నటి వరకూ క్రేజీయెస్ట్ క్రికెటర్ - ఎమర్జింగ్ ప్లేయర్ గా కీర్తనలు అందుకున్న రిషబ్ పంత్ కు గట్టి ఝలక్ తగిలింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అతడికి స్థానమే దక్కలేదు. మ్యాచ్ కు ఒక రోజు ముందే అనౌన్స్ చేసిన ఫైనల్ లెవెన్ జాబితాలో రిషబ్ కు స్థానం ఇవ్వలేదు. ఇది రిషబ్ పంత్ కు గట్టి ఎదురుదెబ్బే.

ఇప్పటికే పలు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు పంత్. ఐపీఎల్ లో అతడి ఆటతీరు అదరగొట్టే స్థాయిలో ఉండటంతో జాతీయ జట్టులో స్థానం దక్కింది. అయితే తీరా జాతీయ జట్టుకు ఎంపిక అయ్యాకా పంత్ ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఏదో నామమాత్రంగా ఒకటీ రెండు మెరుపులకే అతడు పరిమితం అయ్యాడు.

పంత్ కు జట్టులో చాలా అవకాశాలే దక్కాయి. అయితే వాటికి అతడు న్యాయం చేయలేకపోయాడు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పంత్ కు ఎందుకు అలా పదే పదే అవకాశాలు ఇస్తున్నారు, ఇంకా ఎంతోమంది యంగ్ ప్లేయర్లు అవకాశాల కోసం వేచి ఉన్నారు కదా.. అని కొందరు మాజీలు బోర్డుకు చురకలు అంటించారు.

ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి కూడా పంత్ కు బహిరంగ వార్నింగ్ ఇచ్చారు. ఆటతీరులో మార్చుకోవాలని శాస్త్రి సూచించాడు. అయినా పంత్ తీరులో మార్పు లేదు. కీలకమైన మ్యాచ్ లలో అదే నిర్లక్ష్యాన్ని కనబరిచాడు. దీంతో వేటు పడింది. వికెట్ కీపర్ సాహాకు తిరిగి చోటు దక్కింది. గతంలో సాహా గాయపడగా.. పంత్ కు తొలి అవకాశం లభించింది. ఆ తర్వాత సాహాను వరసగా పక్కన పెట్టారు. పంత్ ఫెయిల్యూర్స్ నేపథ్యంలో సాహానే మళ్లీ జాతీయ జట్టు ఫైనల్ ఎలెవన్ లోకి తీసుకున్నారు.