Begin typing your search above and press return to search.

రోజాపై దిగజారుడు ప్రచారం..

By:  Tupaki Desk   |   10 Aug 2017 4:50 PM GMT
రోజాపై దిగజారుడు ప్రచారం..
X
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం ఒకటి మొదలైంది. ఇది వైరల్ గా స్ర్పెడ్ కావడంతో చివరకు ఆమె స్పందించి కేసులు వేస్తానని హెచ్చరించాల్సి వచ్చింది. కారు ప్రమాదంలో రోజా మరణించారంటూ మార్ఫింగ్ చేసిన చిత్రాలు కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండడంతో ఆమె తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. దీనిపై స్పందించిన ఆమె ఈ తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

అసెంబ్లీ నుంచి ఆమెను సస్పెండ్ చేసిన సందర్భంలో ఆమె దీక్షకు దిగిన నాటి చిత్రాలను మార్ఫింగ్ చేసిన కొందరు ఆమె కారు ప్రమాదంలో మరణించారంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించారు. ఈ చిత్రాలు ఫేస్ బుక్ - వాట్సాప్ లలో ఒక్కసారిగా వ్యాపించేశాయి. బతికున్న తనను ఇలా అన్యాయంగా చనిపోయినట్లు చిత్రించడం తగదంటూ ఆమె తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

కాగా ఇలాంటి తప్పుడు ప్రచారం వెనుక తన రాజకీయ శత్రువులు ఉన్నారని ఆమె ఆరోపిస్తున్నారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేనివారంతా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతో దిగజారుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.