Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు కొత్త భ‌యం సృష్టించిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   13 Dec 2018 10:38 AM GMT
కాంగ్రెస్‌ కు కొత్త భ‌యం సృష్టించిన కేసీఆర్‌
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఊహించ‌ని రీతిలో ముందస్తును ముందుకు తెచ్చిన గులాబీ ద‌ళ‌ప‌తి అదే రీతిలో రికార్డ్ స్థాయిలో సీట్లు సాధించి షాక్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌హామహులు ఓట‌మి పాల‌వ‌డం ఆ పార్టీలో క‌ల‌వ‌రానికి దారితీస్తోంది. అయితే, దీనికి కొనసాగింపుగా తాజాగా కాంగ్రెస్‌ కు మ‌రో షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌ లో చేరడానికి ఆసక్తి కనబర్చుస్తున్నట్టు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం కాంగ్రెస్ వ‌ర్గాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

తెలంగాణ భవన్‌ లో బుధవారం మీడియా చిట్‌ చాట్‌ లో కేసీఆర్ మాట్లాడుతూ త‌మ పార్టీ ప‌ట్ల ప‌లువురు ఎమ్మెల్యేలు ఆస‌క్తిగా ఉన్నార‌ని అన్నారు. త్వ‌ర‌లో వీరి చేరిక‌లు ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు. దీంతో కాంగ్రెస్ నేత‌లు త‌మ పార్టీ నాయ‌కుల‌ వైపు అనుమాన‌పు చూపులు మొద‌లుపెట్టారు. కాంగ్రెస్ టికెట్‌ పై గెలిచి గులాబీ గూటికి చేర‌బోయే ఎమ్మెల్యేలు ఎవ‌రా? అంటూ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఆరా తీస్తున్నారు. పార్టీ మార‌కుండా ఉండాల‌ని వారికి చూసిస్తున్నార‌ని స‌మాచారం. ఓవైపు స‌ర్కారు ఏర్పాటులో టీఆర్ ఎస్ బిజీగా ఉంటే...మ‌రోవైపు ఉన్న ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డం కాంగ్రెస్ కుస్తీ ప‌డుతోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్ప‌టికే టీఆర్ ఎస్ బ‌లం 90కి చేరిన సంగ‌తి తెలిసిందే. రామగుండం నుంచి గెలుపొందిన టీఆర్ ఎస్ రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్ - ఖమ్మం జిల్లా వైరా నుంచి ఇండిపెండెంట్‌ గా గెలుపొందిన రాములు నాయక్ టీఆర్ ఎస్‌ కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు వీరు ఇద్దరూ బుధవారం కేటీఆర్‌ ను కలిసి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. తాను ఎన్నికలకు ముందు వరకు టీఆర్ ఎస్ సభ్యుడినేనని కోరుకంటి చందర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా నుంచి ఇండిపెండెంట్‌ గా గెలుపొందిన రాములు నాయక్ బుధవారం సాయంత్రం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ ను కలిసారు. టీఆర్ ఎస్‌ లో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్టు రాములు నాయక్ తెలిపారు. వీరు ఇద్దరు పార్టీలో `అధికారికంగా` చేరితే టీఆర్ ఎస్ బలం 90కి చేరుకోనుంది.