Begin typing your search above and press return to search.

మోడీకి జిన్ పింగ్ ఆ సినిమా గురించి చెప్పారా?

By:  Tupaki Desk   |   16 Oct 2019 4:58 AM GMT
మోడీకి జిన్ పింగ్ ఆ సినిమా గురించి చెప్పారా?
X
ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకునే సందర్భంలో ఎప్పుడో ఒకచోట సినిమాల గురించిన మాటలు రావటం కామన్. సామాన్యులన్న తర్వాత వారి జీవితంలో అత్యంత ప్రభావం చూపించే అంశాల్లో సినిమాలు ఒకటి. మరి.. అత్యుత్తమ నేతలు.. ప్రపంచాల్ని ప్రభావితం చేసే ఇరువురు అగ్రనేతలు భేటీలోనూ సినిమాల గురించి ప్రస్తావన వస్తుందన్నది ఊహించలేం. కానీ.. అలా జరిగిందన్న విషయాన్ని ప్రధాని మోడీనే స్వయంగా చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇద్దరూ ఇటీవల మహాబలిపురం వద్ద భేటీ కావటం తెలిసిందే. తామిద్దరం భేటీ అయిన సమయంలో తనకు జిన్ పింగ్ చెప్పిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆ మధ్య విడుదలైన బాలీవుడ్ మూవీ దంగల్ సినిమాను తాను చూశానని చైనా అధ్యక్షుడు తనకు చెప్పారని.. ఆ సినిమా బాగా నచ్చినట్లు జిన్ పింగ్ చెప్పినట్లు మోడీ పేర్కొన్నారు.

మహిళలు ఏదైనా సాధించగలరని ఆ సినిమాలో బాగా చూపించారని చైనా అధ్యక్షుడు తనతో చెప్పిన వ్యాఖ్యలు తనను సంతోషాన్ని ఇచ్చినట్లుగా చెప్పారు. ఇంతకూ మోడీ మాష్టారికి చైనా అధ్యక్షుడు తనతో చెప్పిన సినిమా కబుర్ల గురించిన ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. దానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు ఢిల్లీ.. హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఆ సందర్భంగా హర్యానా ప్రజలకు ఇట్టే కనెక్ట్ అయ్యేలా చెప్పే మాటల్లో చైనా అధ్యక్షుడు చూసిన దంగల్ ముచ్చటను ఆయన ప్రజలతో పంచుకున్నారు. హర్యానా ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల మల్లయోధుల రియల్ స్టోరీనే దంగల్.

అంతేకాదు.. ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిందో.. ఆ ఇద్దరిలో ఒకరైన బబిత పొగాట్ బీజేపీ తరఫున చర్ఖిదాద్రి స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఇలాంటివేళ.. హర్యానీయుల మనసు దోచే మాటలు మోడీ నోటి నుంచి రాకుండా ఉంటాయా? ఎప్పుడే విషయాన్ని చెబితే.. ప్రజలు ఇట్టే కనెక్ట్ అవుతారో మోడీకి ఆ మాత్రం తెలీదా?