Begin typing your search above and press return to search.

మా జోలికి వ‌స్తే త‌గ్గేదే లేదు: చైనా అధ్యక్షుడు

By:  Tupaki Desk   |   1 Aug 2017 9:08 AM GMT
మా జోలికి వ‌స్తే త‌గ్గేదే లేదు: చైనా అధ్యక్షుడు
X
ఆర్మీ డే సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌ పింగ్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. డోక్‌ లామ్ ప్రాంతంలో ఇండియాతో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యం ఉన్న‌ప్ప‌టికీ న‌ర్మ‌గ‌ర్భంగా ఆయ‌న హెచ్చ‌రిక‌లు జారీచేవారు. చైనా ఎప్పుడూ త‌మ‌ సార్వ‌భౌమ‌త్వం - భ‌ద్ర‌త‌ - అభివృద్ధి ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీ ప‌డ‌బోద‌ని ఆ దేశ ర‌థ‌సార‌థి జిన్‌ పింగ్‌ స్ప‌ష్టంచేశారు. ``చైనా ప్ర‌జ‌లు శాంతినే కోరుకుంటారు. దూకుడుగా ఉండ‌టం, రాజ్యాన్ని విస్త‌రించే ఆలోచ‌న‌లు మాకు లేవు. కానీ మా భూభాగంలో చొర‌బాట్ల‌ను తిప్పికొట్టే సామ‌ర్థ్యం ఉంది. మా భూభాగం నుంచి చిన్న భాగాన్ని కూడా విడ‌దీసే అవ‌కాశం ఎవ‌రికీ, ఎప్ప‌టికీ క‌ల్పించం``అని జీ తేల్చి చెప్పారు. స‌రిహ‌ద్దుల్లో ఒకింత ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ 90వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించిన సంబ‌రాల్లో జీ పాల్గొన్నారు. పీఎల్ ఏ సంబ‌రాల్లో చైనాతోపాటు ఇండియా - భూటాన్ ప్ర‌తినిధులు కూడా పాల్గొన్నారు. త‌మ‌ సార్వ‌భౌమాధికారానికి హాని క‌లిగించే ఎలాంటి చ‌ర్య‌ల‌ను ఉపేక్షించ‌బోమ‌ని జీ స్ప‌ష్టంచేశారు. 1962 యుద్ధం త‌ర్వాత నెల రోజులకు పైగా ఇండోచైనా మ‌ధ్య ఇంత ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌డం ఇదే తొలిసారి. డోక్‌ లామ్‌ లోకి భార‌త బ‌ల‌గాలే చొచ్చుకొచ్చాయని చైనా ఆరోపిస్తుండ‌గా.. వివాదాస్ప‌ద ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న అక్ర‌మ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామ‌ని భార‌త్ వాదిస్తున్న‌ది. ఓవైపు ఈ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలోనే ఉత్త‌రాఖండ్‌ లోని బారాహోతిలోకి 50 మంది చైనా సైనికులు దూసుకు రావ‌డం రెండు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను మ‌రింత బ‌ల‌హీనం చేసింది.