Begin typing your search above and press return to search.

వర్షాలకు యాదాద్రి దుస్థితి.. కేసీఆర్, కేటీఆర్ ల పరువు తీస్తున్నాయే?

By:  Tupaki Desk   |   5 May 2022 1:03 PM GMT
వర్షాలకు యాదాద్రి దుస్థితి.. కేసీఆర్, కేటీఆర్ ల పరువు తీస్తున్నాయే?
X
గత వారం ఏపీ రోడ్లపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టించాయి. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే గొప్ప క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దానని.. గొప్పగా నిర్మించానని అన్నారు. ఆ గొప్పతనం ఇప్పుడు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్టైంది. యాదాద్రిని ముంచిన భారీ వర్షాలు ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ల పరువు తీసేలా ఉన్నాయి. వారి ప్రతిష్టను సోషల్ మీడియా సాక్షిగా దిగజార్చుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి గురించి గొప్పగా చెప్పిన మాటలను.. నేటి వర్షాలకు దుస్థితిని కలిపేసి నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వర్షాలకు యాదాద్రి రహదారుల దుస్థితిపై విమర్శలకు దిగుతున్నారు.

ఏడు సంవత్సరాల సుదీర్ఘ పునర్నిర్మాణం తర్వాత ఈ దైవిక మందిరం ఇటీవలే ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1800 కోట్లకుపైగా నిధులు వెచ్చించగా ఆలయ పునరుద్ధరణకు మరో రూ.2000 కోట్లు వెచ్చించింది.

అయితే ఈ యాదాద్రి అభివృద్ధి అంతా ఒక్క భారీ వర్షానికి తుడిచిపెట్టుకుపోయింది. యాదాద్రిలో వేసిన రోడ్ల నాణ్యతను బట్టబయలు చేసింది. రోడ్లు వేయడానికి ఉపయోగించిన పదార్థాల నాణ్యతను బయటపెట్టింది. నాసిరకం రోడ్లు కొట్టుకుపోయాయి. అలాగే ఆలయం వద్ద తాత్కాలికంగా వేసిన షెడ్లు గాలికి కొట్టుకుపోయాయి. క్యూ కాంప్లెక్స్‌లోకి నీరు చేరింది.

యాదాద్రికి చేరుకున్న ప్రజలు రోడ్లను చూసి షాకయ్యారు, వర్షాల వల్ల జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇదేం అభివృద్ధి అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పొరుగు రాష్ట్రాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కొందరు యాదాద్రి దుస్థితిపై మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు.

వర్షాకాలం ప్రారంభం కావడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ వానలకే యాదాద్రి కొట్టుకుపోతే.. ఇక వర్షాకాలం పరిస్థితి ఏంటని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విశ్వసనీయమైన కాంట్రాక్టర్లకు ఈ పనులు కేటాయించాలని, యాదాద్రిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది నాణ్యమైన రోడ్లు వేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు యాదాద్రి అభివృద్ధిపై కేసీఆర్ చేసిన గొప్ప వ్యాఖ్యల ప్రతిష్టను దెబ్బతీశాయనే చెప్పొచ్చు .ఇక ఏపీ రోడ్ల దుస్థితిని ప్రశ్నించిన కేటీఆర్ ఇప్పుడు ఒక్క వానకే కొట్టుకుపోయిన యాదాద్రి రోడ్లపై స్పందించాలని నెటిజన్లు ట్యాగ్ చేసి మరీ నిలదీస్తున్నారు.