Begin typing your search above and press return to search.

వేల సంవత్సరాలు మన్నుతుందన్నారు.. ఒక్క వర్షంతో కొట్టేసింది

By:  Tupaki Desk   |   6 May 2022 2:16 AM GMT
వేల సంవత్సరాలు మన్నుతుందన్నారు.. ఒక్క వర్షంతో కొట్టేసింది
X
వందల ఏళ్ల నాటి ఆలయం.చుట్టూ కొండరాళ్ల నడుమ వెలిసిన స్వయం భూ. అలాంటి ఆలయాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి మించి సిద్ధం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలన్న విషయాన్ని తాజాగా కురిసిన గాలివాన తేల్చేసింది. అంతేనా.. వేలాది ఏళ్లు మన్నేలా ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా చెప్పిందంతా డొల్లేనని స్పష్టమైంది. ఒక గట్టి వానకు యాదాద్రి ఎంతలా ఆగమాగమైందో చూసినోళ్లు.. నోరెళ్ల బెడుతున్నారు. తియ్యగా ఉండే కేసీఆర్ మాటలకు.. చేదుగా ఉండే వాస్తవానికి మధ్య అంతరం ఇంతలా ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు.

పునర్నిర్మాణ పనుల్లో లోపాల్ని చెప్పాల్సి వస్తే.. అదో పెద్ద లిస్టు అవుతుందని చెబుతున్నారు. తరచి చూస్తే.. నిర్మాణ పనులు నాసిరకంగా ఉండటమే కాదు.. అడుగడుగునా లోపాలు బయట పడేలా ఉండటం గమనార్హం. అన్నింటికి మించి అష్ట భుజి ప్రాకార మండపంలో వర్షపు నీరు లీకేజీలతో డంగు సున్నం బయటకు వస్తున్న వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. డంగు సున్నంతో నిర్మాణం చేయటం వల్ల వేలాది ఏళ్లు మన్నికగా ఉంటుందని చెప్పారు. కానీ.. ఒక్క వానతో అదెంత నిజమన్న విషయం తేలిపోయిన పరిస్థితి.

రెండు రోజుల క్రితం కురిసిన గాలివానకు యాదాద్రిలో ఏమేం లోపాలు బయటకు వచ్చాయన్న దానిపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన చేదు వాస్తవాల లెక్క చూస్తే..

- పటిష్టంగా ఉంటాయని చెప్పే కృష్ణరాతి శిలల నిర్మాణాలు వర్షం దెబ్బకు బీటలు వారాయి.
- వేలాది ఏళ్లు ఉంటాయని చెప్పే డంగు సున్నంతో నిర్మాణాలు చేయగా లీకేజీలతో డంగు సున్నం బయటకు వచ్చేస్తోంది.
- ఆలయ తిరువీధుల్లో చేరిన వర్షాన్ని తొలగించేందుకు ఫ్లోరింగ్ బండల్ని తొలగించాల్సి వచ్చింది
- ప్రధానాలయానికి ఆగ్నేయ దిశలో ప్రతిష్ఠాత్మకంగా కృష్ణరాతి శిలలతో నిర్మించిన బ్రహ్మోత్సవ మండపం మెట్లు బీటలు వారాయి.
- అష్ట భుజి ప్రాకార మండపంలో లీకేజీలు
- కొండ కింద తోటల్లో ఉబికి వస్తున్న నీరు
- వర్షపునీరు కారుతోన్న వేంచేవు మండపం (ప్రధాన ఆలయానికి పడమటి దిశలో ఉంది)
- బ్రహ్మోత్సవ మండపం కింద రాళ్లు కదిలిపోయాయి.
- ఆశ్చర్యకరంగా దర్శన క్యూ కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తులోకి వర్షపు నీరు వచ్చేయటం.
- వీటితో పాటు రోడ్డు కుంగింది. కొండ పైన బస్ బే.. కిండ కింద బస్టాండ్.. ఘాట్ రోడ్డు మొత్తం బురదమయంగా మారింది.
- కొండ కింద రింగు రోడ్డు ప్రాంతంలో బురద మట్టితో నిండింది.