Begin typing your search above and press return to search.

తాళి తాకట్టు పెట్టి వైరస్ యోధుడి అంత్యక్రియలు చేసిన భార్య !

By:  Tupaki Desk   |   3 Jun 2020 1:30 PM GMT
తాళి తాకట్టు పెట్టి వైరస్ యోధుడి అంత్యక్రియలు చేసిన భార్య !
X
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ పై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు వైద్య సిబ్బంది , వైద్యులు , పోలీసులు. ప్రాణాలతో చెలగాటం అని తెలిసినా కూడా ప్రజల కోసం ప్రాణాలని పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మహమ్మారితో ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న యోధులపై ప్రభుత్వాలు ప్రశంసలు కురిపించాయి. యుద్ధ విమానాల ద్వారా పూలవర్షం కురిపించి భారత త్రివిధ దళాలు వారికి ఘనంగా జేజేలు పలికాయి.కానీ, ఇవేవీ వారికి ఏవిధంగానూ ఊరట కలిగించడం లేదు. వైరస్ వారియర్స్ మరణిస్తే దిక్కూ మొక్కూ లేకుండా పోతోంది.

తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ ఘటన హృదయాలను కలచివేస్తోంది. రెండు నెలలుగా కరోనా రోగుల సేవలో విరామం లేకుండా పనిచేస్తున్న ఓ అంబులెన్స్ డ్రైవర్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తే, అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక అతడి భార్య తన తాళిబొట్టును తాకట్టు పెట్టింది. కర్ణాటకలోని గదగ్‌ జిల్లా కొన్నూర్ ‌కు చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ ఉమేశ్ హదగలి రెండు నెలలుగా వైరస్ విధుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు. మే 27న ఉదయం 9 గంటలకు అతడు విధుల నిమిత్తం ఇంటి నుంచి బయల్దేరాడు. కాసేపటికే అతడి సహోద్యోగి ఉమేశ్ భార్య జ్యోతికి కాల్ చేసి అతడు తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధ పడుతున్నట్లు సమాచారం ఇచ్చాడు.

రామదుర్గలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. డ్రైవర్ ఉమేశ్‌ ను పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమించడంతో ఎస్‌డీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఉమేశ్ ప్రాణాలు విడిచాడు. ఉమేశ్ అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు లేక అతడి భార్య జ్యోతి పలువురిని సాయం అర్థించింది. ఆమెను ఆదుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తన మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చుకుంది. ఆ తరువాత కొంత మంది దగ్గరి బంధువులు, ఉమేశ్‌తో కలిసి పనిచేస్తున్న కొంత మంది సాయంతో అతడి అంత్యక్రియలు పూర్తి చేసింది.

ఆ తరువాత సాయం కోరుతూ సోషల్ మీడియాలో జ్యోతి పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ ‌గా మారింది. రెండు నెలలుగా వైరస్ సోకినా వారి సేవలో విరామం లేకుండా పనిచేస్తూ తన భర్త గుండెపోటుతో మరణించాడని.. ఏడేళ్ల, పన్నెండేళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలను పోషించడానికి సాయం చేయాలని ఆమె అర్థించింది. ఈ వీడియో సీఎం యెడియూరప్ప దృష్టికి చేరడంతో ఆయన దీనిపై స్పందించారు.కర్ణాటక సీఎం యెడియూరప్ప సోమవారం జ్యోతికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు .అలాగే, నష్ట పరిహారం, బీమా మొత్తం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదే సమయంలో తన ఇద్దరు పిల్లలను చదివించడానికి ఏదైనా ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రిని జ్యోతి కోరింది.