Begin typing your search above and press return to search.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో రచ్చరచ్చ

By:  Tupaki Desk   |   10 Dec 2015 11:31 AM GMT
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో రచ్చరచ్చ
X
టీడీపీ నేతల వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు - ప్రధాని మోడీ మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయి. మోడీ స్థానంలో చంద్రబాబు ప్రధాని అవుతారనే అర్థంలో తెలుగుదేశం నేత యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆ మాటను బీజేపీ అధిష్ఠానానికి, వీలైతే మోడీ వరకు మోసుకెళ్లాలని బీజేపీలో ఓ వర్గం ప్లాన్ చేస్తోంది.

చంద్రబాబునాయుడు ప్రధాని అవుతారన్న రాజేంద్రప్రసాద్ మాటల రికార్డును కొందరు బిజెపి నేతలు ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధినేత అమిత్‌ షా - హోంమంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ లకు పంపించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లోకేష్ సీఎం అవుతారన్న విషయం ఆ పార్టీకి సంబంధించినదని, అయితే, బాబు ప్రధాని అవుతారంటే, వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓడిపోవాలన్న టీడీపీ కోరిక తెలుస్తోందని వారు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు బీహార్‌ లో బిజెపి ఓటమి తర్వాత టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావు వంటి నేతలు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలను బిజెపి నేతలు గుర్తు చేస్తున్నారు.

కాగా రాజేంద్రప్రసాద్ టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నందున ఆయన మాటలను పార్టీ మాటలుగానే భావించాల్సి వస్తుంది. టిడిపి నాయకత్వం అనుమతితోనే ఆయన అలా అన్నారనే అనుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయన వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేకపోయినా చంద్రబాబుకు మాత్రం తలనొప్పి తప్పడం లేదు. రెండు పార్టీల మధ్య సమన్వయ భేటీ జరిగి వారం కాకుండానే టీడీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అంటోంది. అంతేకాకుండా చంద్రబాబు కానీ టీడీపీ ముఖ్యులు కానీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను ఖండించలేదనీ ఆక్షేపిస్తున్నారు. కాగా రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై బయటపడకున్నా టీడీపీలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనవసరంగా మోదీకి వ్యతిరేకం కావడం ఎందుకని అంటున్నారు.