Begin typing your search above and press return to search.

యుద్ధం మధ్యలో వెనుదిరుగుతావా జగన్‌?

By:  Tupaki Desk   |   20 March 2015 7:44 AM GMT
యుద్ధం మధ్యలో వెనుదిరుగుతావా జగన్‌?
X
బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఏపీ అసెంబ్లీని చూసిన వారికి రణరంగం గుర్తుకు రాక మానదు. అధికార.. విపక్షాలు రెండు పోటాపోటీగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే.

ఒకదశలో మాటలు దాటి.. చేతల వరకూ వ్యవహారం వెళ్లటం తెలిసిందే. బండ బూతులు తిట్టుకుంటూ అసభ్యంగా వ్యవహరించటం కూడా.. టీవీల్లో చూసిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ ఏపీ విపక్ష నేత జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడుతూ సభ నుంచి వెళ్లిపోవటమే కాదు.. తాము ఏపీ స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చర్చకు పిలిస్తే తప్ప సభకు రామంటూ శపధం చేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అధికారపక్షానికి చెందిన విప్‌ యామినీ బాల కీలకవ్యాఖ్య చేశారు. అసెంబ్లీ సమావేశాలకు విపక్షం హాజరు కాకపోవటాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. యుద్ధంలో దిగిన రాజు విజయమో.. వీర స్వర్గమో అన్నట్లు వ్యవహరిస్తారే కానీ.. యుద్ధం మధ్యలో వెనుదిరగటం మాత్రం చేయరని..కానీ జగన్‌ వైఖరి అదే తీరులో ఉందని వ్యాఖ్యానించారు.

తాజాగా జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. జగన్‌ చేస్తున్న యుద్ధాన్ని ఏమనాలో కూడా అర్థంకావటం లేదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటారని.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఆ తీరులో వ్యవహరించటం లేదన్నారు.

అయినా.. ఏదో తెలిసీ తెలియని అమాయకత్వంతో కాస్త ఎక్కువసేపు మాట్లాడేందుకు జగన్‌బాబు అడిగితే ఇచ్చేస్తే ఇంత రచ్చ ఉండదు కదా. అనుభవం లేదు.. అనుభవం లేదని దెప్పి పొడితే బదులు.. చిన్నపిల్లాడు ముచ్చటపడుతున్న మైకును ఇస్తే ఏమవుతుంది? తమ్ముళ్లు ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందేమో..?