Begin typing your search above and press return to search.

రోజాకు పోటీగా టీడీపీలో కొత్త నేత?

By:  Tupaki Desk   |   5 Nov 2016 8:35 AM GMT
రోజాకు పోటీగా టీడీపీలో కొత్త నేత?
X
వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే ఫైర్ బ్రాండ్. ఆమె మాట్లాడితే ఎదురునిలవడం పాలక పార్టీ నేతలకు కష్టమే. అసెంబ్లీలోనైనా - బయటైనా అంతే. అందుకే అసెంబ్లీ నుంచి ఆమెను సుదీర్ఘ కాలం బహిష్కరించేందుకు అధికార టీడీపీ ప్రయత్నించిందన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు - సీనియర్లు జూనియర్లన్న తేడా లేకుండా తేడా వస్తే ఎవరిపైనైనా విరుచుకుపడే రోజా అంటే టీడీపీ నేతల్లో భయం ఉంది. ఆమెను ఎదుర్కొనే సమర్థులు తమ పార్టీలో లేరని పలుమార్లు నేతలు అనుకున్న సందర్బాలూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళా నేతలతోనే ఆమెకు కౌంటర్ ఇప్పిస్తే బాగుంటుందని మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు గతంలో చంద్రబాబుకు సూచించారు. రోజాపై విమర్శలు చేసినా... ఆమె చంద్రబాబుపై చేసే విమర్శలకు తాము సమాధానం చెప్పినా ఆమె తమ గుట్టుమట్లన్నీ బయటపెట్టి పరువు తీస్తుందని భయపడే నేతలు టీడీపీలో ఉన్నారని చెబుతారు. దీంతో రోజాను సమర్తంగా ఎదుర్కొనే నేత కోసం టీడీపీ చాలా కాలంగా వెతుకుతోందట. తాజాగా వారికి మహిళా పారిశ్రామికవేత్త యామిని సాధినేని ఆశాదీపంలా కనిపిస్తోందని.. ఆమెను ప్రొజెక్టు చేయబోతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే విశాఖలో లవ్ ఫెస్టివల్ పై రోజా చేసిన వ్యాఖ్యలపై యామిని కౌంటర్ వేశారని చెబుతున్నారు. ముందుముందు యామినిని మరింత యాక్టివ్ చేసి రోజాకు ధీటుగా తయారుచేయాలన్నది టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.

విశాఖలో బికినీ ప్రేమోత్సవం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలు - మహిళా సంఘాలపై మహిళా పారిశ్రామికవేత్త యామిని సాదినేని ఫైర్ అయ్యారు. అన్ని సంస్కృతులను అర్థం చేసుకోవాలని ఆమె చెప్పారు. టూరిజం ఫెస్టివల్‌ను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందని మండిపడ్డారామె. ఒక ఛానల్‌ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆమె… రోజాపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకురాలు భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని రోజాను ఉద్దేశించి అన్నారు. ప్రజల చేత ఎన్నుకుని అసెంబ్లీ సాక్షిగా తోటి మహిళా సభ్యులను కించపరిచిన వ్యక్తికి సభ్యత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ముందు జబర్ధస్త్ లాంటి కార్యక్రమాలను మానుకోవాలన్నారు. ఎన్నో ఏళ్లు సినిమాల్లో నటించిన ఆమె( రోజా) వాటి ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారో అందరికీ తెలుసన్నారు.

ముంబాయి - గోవా - జపాన్‌ లో ఇలాంటి ఫెస్టివల్స్ చాలా కామన్‌ అని ఆమె చెప్పారు. విశాఖలో ప్రేమోత్సవం వద్దంటున్న వారు గోవా వెళ్లి రావడం లేదా అని ప్రశ్నించారు. సినిమాల్లో అశ్లీలత ఉంటున్నా కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి చూడడం లేదా అని ప్రశ్నించారు. అన్ని సంస్కృతులను కలుపుకుంది కాబట్టే సింగపూర్ ఈ రోజు ఆ స్థాయిలో అభివృద్ధి చెందిందని విశ్లేషించారు. ప్రేమోత్సవం ద్వారా విశాఖకు ప్రపంచ పటంలోనే ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పారామె. మొత్తం మీద చంద్రబాబు చేస్తున్న బికినీ ఫెస్టివల్‌ను టీడీపీ నేతల కంటే బలంగా పారిశ్రామికవేత్త యామిని సాదినేని సమర్ధించారు. టీడీపీ మహిళా నేతల కంటే ఘాటుగా వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విమర్శలు చేశారు.

ఇదంతా చూస్తుంటే చాలాకాలంగా టీడీపీతో కలిసి నడుస్తున్న ఆమె ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతారని... ఆమెను టీడీపీ రోజాపై దాడికి ఉపయోగించుకోబోతుందని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/