Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకు కనిపించావమ్మా యామిని

By:  Tupaki Desk   |   18 March 2020 2:30 AM GMT
ఎన్నాళ్లకు కనిపించావమ్మా యామిని
X
అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముందు ఫైర్ బ్రాండ్ గా కనిపించాలని ప్రయత్నించిన నాయకురాలు అధికారం కోల్పోగానే కనుమరుగైంది. మీడియా ముందు తెగ ఆరాటం చేసిన ఆ మహిళ కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమె ఇటీవల ఓ పార్టీలో చేరింది. ఆ పార్టీలో చేరిన తర్వాత కూడా చేరి తప్పు చేశాన అన్నట్లు భావించి మీడియా ముందుకు రానే లేదు. చివరకు ఏ పార్టీ అయితేనేం.. అని తాజాగా ఆమె మీడియా ముందుకు రాకుండా సోషల్ మీడియా ముందుకువచ్చింది.

స్థానిక ఎన్నికల వాయిదా నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ పై పలు వ్యాఖ్యలు చేశారు. వాటిని సాకుగా చేసుకుని ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. జగన్ చేసిన పారాసిటమల్, బ్లీచింగ్ పౌడర్ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు సాధినేని యామిని తప్పుబడుతూ విమర్శలు చేశారు. కరోనాను ఎదుర్కోవడానికి ఒక పారసెటమల్ గోలీ చాలని సీఎం చెప్పడం సరికాదని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి పారసెటమాల్ వేసుకుంటే.. అది ప్రాణాలకే ముప్పు అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా వైరస్ చనిపోతుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి తీసుకునే చర్యల కంటే జగన్ కు స్థానిక ఎన్నికలే ముఖ్యమనే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్‌కు కులం అంటగడుతూ.. ఏకవచనంతో సంబోధించడం జగన్ కు తగదని తప్పుబట్టారు.

ఇక్కడి వరకు బాగానే ఆమె రాజకీయ భవిష్యత్ పైనే గందరగోళం ఏర్పడింది. గతంలో మీడియా ముందు నానా హంగామా చేసిన యామిని శర్మ ప్రస్తుతం తెరవెనుక ఉండడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. అప్పట్లో టీడీపీలో యామిని ఫైర్ బ్రాండ్ గా వెలిగిన ఆమె బీజేపీలో అనామకురాలిగా.. ప్రాధాన్యం లేని నాయకురాలిగా ఉన్నారని సమాచారం. అందుకే మీడియా ముందుకు రావడం లేదని ఏపీలో వినిపిస్తున్న మాట.