Begin typing your search above and press return to search.

యామినీ రాజకీయ అజ్ఞాతం వెనుక కథ ఇదేనా?

By:  Tupaki Desk   |   5 Sep 2019 6:52 AM GMT
యామినీ రాజకీయ అజ్ఞాతం వెనుక కథ ఇదేనా?
X
ఒక్కసారి విడిచిన బాణం.. జారిన మాట వెనక్కి తిరిగి తీసుకోవడం కష్టమంటారు.. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కథ ఇదీ.. టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా మారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ - వైసీపీ నేతలపై అనరాని మాటలు అని.. నోటికొచ్చినట్టు వ్యక్తిగత విమర్శలు చేసిన సాధినేని యామినీ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా తయారైందన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మొన్నటివరకు చంద్రబాబు ముఖ్యమంత్రి.. ఆయన అండ దండా పుష్కలం.. దీంతో టీడీపీ రాజకీయ యవనికపై దూసుకొచ్చిన ఫైర్ బ్రాండ్ లేడిలా యామినీ రెచ్చిపోయింది. ప్రతిపక్ష మైన వైసీపీని - ఆ పార్టీ అధినేత జగన్ ను అనరాని మాటలు అన్నది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనుక చంద్రబాబు - టీడీపీ - అధికార బలం ఉండడంతో ఎక్కడా తగ్గలేదు..

కానీ కాలం పెట్టిన పరీక్షలో టీడీపీ ఓడిపోయింది. ఆ పార్టీ అధినేతే ఘోర ఓటమి నుంచి తేరుకోవడం లేదు. ఇక చంద్రబాబు ప్రోద్బలంతో ఊసిగొల్పిన నేతలు - మాజీ మంత్రులంతా మౌనంగా ఉంటున్నారు. బయటకు వచ్చి మాట్లాడడమే లేదు. ఈ నేపథ్యంలో మొన్నటివరకు వైసీపీని చెడుగుడు ఆడిన టీడీపీ అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని సైతం ఇప్పుడు రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు చంద్రబాబుకే దిక్కులేకుండా పోయిన పరిస్థితి రాజకీయాల్లో ఉంది. అక్కడ మోడీని గద్దెదించుతానని ఢిల్లీలో తొడగొట్టారు. ఇక్కడ వైసీపీని అణచాలని చూశారు. నవ్విన నాప చేనే పండినట్టుగా మోడీ - జగన్ గెలిచి చంద్రబాబు ఓడిపోయారు. చెడుగుడు ఆడేస్తున్నారు. అందుకే ఇంతటి విపత్కర పరిస్థితిలో చంద్రబాబే మోడీని పల్లెత్తు మాట అనని పరిస్థితి దాపురించింది. మోడీతో కాళ్లబేరానికి ప్రయత్నిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. దీంతో తత్వం బోధపడిన ఫైర్ బ్రాండ్ సాధినేని యామినీ కాస్తా ఫైర్ లేని బ్రాండుగా మారి మౌనముద్ర వహించారన్న చర్చ సాగుతోంది.

అయితే ఇటీవలే సాధినేని యామినీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసినట్టు ఫొటో ఉండడంతో ఆమే టీడీపీలో ఉంటే సేఫ్ కాదని.. బీజేపీలో చేరితేనే తనకు భద్రత - భవిష్యత్ ఉంటుందని.. కమలంలోకి ఆమె చేరడం ఖాయమే అనుకున్నారంతా.. బాబు - టీడీపీ కాడిని వదిలేస్తారని భావించారంతా.. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.

తాజాగా చాలా రోజుల తర్వాత అజ్ఞాత వాసం వీడిన సాధినేని యామిని తాను సైలెంట్ గా రాజకీయ అజ్ఞాతంలో ఉండడానికి కారణం చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై కూడా స్పందించారు. తన వ్యక్తిగత కారణాల వల్లే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దేశంలో బీజేపీ - రాష్ట్రంలో వైసీపీని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించారని.. వారికి కాస్త సమయం ఇవ్వాలనే తాను సైలెంట్ గా ఉంటున్నట్టు ప్రకటించారు. ఇంకా మూడు నెలల పాటు తాను వారి పరిపాలనను చూస్తానని.. తర్వాత అభిప్రాయం చెబుతానని నోరు విప్పారు. అయితే చంద్రబాబు ఫోన్ చేసి యాక్టివ్ గా ఉండాలని కోరారని.. అయినా తన వ్యక్తిగత కారణాల వల్లే ప్రస్తుతానికి సైలెంట్ అయ్యానని వివరించారు.ఇక తాను టీడీపీని వీడి ఏపార్టీలోకి వెళ్తాననే విషయంపై మాట్లాడదలుచుకోలేదు అని చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ మార్పు ప్రచారంపై స్పందించనన్నారు.

ఇలా టీడీపీకి బలమైన వాయిస్ లా మారిన సాధినేని యామిని రాజకీయ పరిస్థితి తలకిందులైంది. అనువుగానీ చోట అధికంగా మాట్లాడితే ఏమవుతుందో యామినికి తెలుసు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని రాజకీయ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాజకీయాల్లో ఓర్పు, నేర్పు చాలా అవసరం అని.. ఇలా అధికార అండతో రెచ్చిపోతే తర్వాతి పరిణామాలతో ఇలానే అజ్ఞాతంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని..దీనికి యామినియే గొప్ప ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.