Begin typing your search above and press return to search.

యనమల ఆరాటం...చంద్రబాబు మొహమాటం

By:  Tupaki Desk   |   6 Oct 2022 5:30 PM GMT
యనమల ఆరాటం...చంద్రబాబు మొహమాటం
X
ఆయన మాజీ స్పీకర్, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత. పేరు యనమల రామక్రిష్ణుడు తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన నాయకుడు. టీడీపీ ఎపుడు అధికారంలోకి వచ్చినా బాబు పక్కన క్యాబినెట్ బెర్త్ ఆయనకు ఖాయం. ఇక 2025 దాకా ఎమ్మెల్సీ పదవి చేతిలో ఉంచుకున్న యనమల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలని చూస్తున్నారు.

తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా చూసుకోవాలన్న యనమల వారి ఆరాటానికి చంద్రబాబు మొహమాటం కూడా సహకారం అందిస్తూండడంతో తుని అసెంబ్లీ సీటు కుమార్తెకు కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. ఇప్పటికి ఇరవైఏళ్ళుగా తునిలో యనమల ఫ్యామిలీకి గెలుపు పిలుపు వినబడడంలేదు. 2009 ఎన్నికల్లో యమమల స్వయంగా టీడీపీ అభ్యర్ధిగా ఓడారు.

ఇక 2014, 2019 ఎన్నికల్లో తన తమ్ముడు యనమల క్రిష్ణుడిని పోటీకి పెట్టినా కూడా ఆయనా వరసగా ఓడారు. మరి 2024 సంగతేంటి అంటే ఈసారి కూతురికి టికెట్ ఇవ్వాలని యనమల బాబు వద్ద గట్టిగానే పోరు పెడుతూ వస్తున్నారు అని ప్రచారంలో ఉన్న మాట. అయితే తునిలో కాంగ్రెస్ రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు గెలిచింది. ఇపుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు.

పైగా అయన మంత్రిగా ఉన్నారు. నోరున్న దాడిశెట్టి రాజా ధాటిని ఎదుర్కోవడం కష్టమే అని తమ్ముళ్ళు భావిస్తున్న వేళ సమర్ధుడికి యనమల ఫ్యామిలీకి చెందని వారికి టికెట్ ఇస్తే గెలుచుకుని వస్తారని కూడా అధినాయకత్వానికి సూచిస్తున్నారు. కానీ యనమల తన సీనియారిటీని తమ రాజకీయ అనుభవాన్ని బాగా ఉపయోగించారు అని అంటున్నారు. దాంతో చక్రం గట్టిగా తిప్పేసి కుమార్తెకు టికెట్ ఇప్పించుకుంటున్నారు అని టాక్ వేడిగా వాడిగా నడుస్తోంది.

యనమల రామక్రిష్ణుడు అంటే చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానం. దానికి కారణం 1995లో ఆయన బాబు సీఎం కావడానికి చేసిన భారీ హెల్ప్. ఆనాడు స్పీకర్ గా యనమల ఉన్నారు. ఆయన మొత్తం అంతా బాబుకు అనుకూలంగా కధ నడిపించి ఫస్ట్ టైమ్ సీఎం అయ్యేలా చూశారు. దాంతో నాటి నుంచి యనమల అంటే బాబుకు ఒక రకమైన కృతజ్ఞత కూడా ఉంది అని అంటారు. సరే అంతా బాగున్నపుడు దాన్ని చూపించుకున్నా ఫర్వాలేదు కానీ ఇపుడు పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉంది.

ఈ టైమ్ లో రిస్క్ అవసరమా అని క్యాడర్ అంటోందిట. చంద్రబాబు మరీ ఇంతలా మొహమాటపడిపోయి యనమల కుమార్తెకు టికెట్ ఇస్తే ఎలా అని అంటున్నారుట. అయినా సరే యనమల వారు మాత్రం టికెట్ సాధించేశారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి మొహమాటాలకు పోను, గెలుపు గుర్రాలకే టికెట్లు అంటున్న చంద్రబాబు మాటల వరకేనా లేక చేతల దాకా ఏమైనా చూపించేది ఉందా అంటే ఆదిలోనే యనమల కధను చూస్తే అర్ధం కావడం లేదా అంటున్నారుట తమ్ముళ్ళు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.