Begin typing your search above and press return to search.

తమ్ముడ్నిపక్కన పెట్టేసి కుమార్తెను సీన్లోకి తెస్తున్న యనమల

By:  Tupaki Desk   |   14 Aug 2022 4:47 AM GMT
తమ్ముడ్నిపక్కన పెట్టేసి కుమార్తెను సీన్లోకి తెస్తున్న యనమల
X
తెలుగుదేశం పార్టీకి సంబంధించి కనిపించే కొన్ని సిత్రాలు అలా ఇలా ఉండవు. ఆ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు కొందరు నేతలు వెలిగిపోతూ.. అంతా తామైనట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ హడావుడి చేస్తుంటారు. అయితే.. పవర్ చేజారిందా? ఇక అంతే సంగతులు. పెద్దగా కనిపించకుండా.. ప్రజల్లోకి రాకుండా.. ప్రత్యర్థులపై పోరాటం అన్నది చేయకుండా తమదైన ప్రపంచంలో ఉండిపోతారు. కానీ.. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయన్న వేళలో.. టైమ్లీగా రీఎంట్రీ ఇస్తూ.. తమ కథను నడిపిస్తుంటారు. ఈ కోవకు చెందిన నేతల్లో మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఒకరని చెప్పాలి. టీడీపీలో ఆయన్ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

1983 నుంచి 2004 వరకు 26 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. 2009లో తొలిసారి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన ఆయన.. ఆ మాట మీదే నిలబెట్టారు. తనకు బదులుగా తన తమ్ముడ్ని బరిలోకి దింపినప్పటికీ ఆశించినంత ఫలితం రాని పరిస్థితి. ఇదిలా ఉంటే 2014లో పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఆయన్ను ఎమ్మెల్సీని చేయటం.. ఆర్థిక మంత్రిగా ఆయన చేతికి పగ్గాలు అప్పజెప్పటం తెలిసిందే. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయకున్నా.. పార్టీ దారుణ పరాజయాన్ని పొందటం తెలిసిందే.

అప్పటి నుంచి ఇప్పటివరకు చాలానే పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ.. ఆయన పెద్దగా కనిపించని పరిస్థితి. ఇలాంటి తీరు యనమలకు మామూలేఅన్న విషయం తెలిసింది. ఇప్పుడిప్పుడు సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటోంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. దగ్గరదగ్గర ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే.. ఈ మధ్యన రాజకీయంగా చురుగ్గా లేని వారు సైతం మళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివేట్ అవుతున్నారు. పార్టీలో నెంబరు టూగా చెప్పుకునే యనమల.. ఆయన వ్యవహరించే తీరు మాత్రం ఆ స్థాయిలో కనిపించదని చెబుతుంటారు.

ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడికి బదులుగా తన పెద్ద కుమార్తె దివ్యను సీన్లోకి తీసుకురావాలని.. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన తుని నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా తాజా పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీలోని మిగిలిన నేతలకు యనమలకు ఉన్న తేడా ఏమిటంటే..పార్టీ క్యాడర్ కు కింది స్థాయి నేతలకు అస్సలు టచ్ లో ఉండరని చెబుతారు. చాలా తక్కువ మంది నేతలకు మాత్రమే అందుబాటులో ఉండే ఆయన.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని రీతిలో.. ద్వితీయ శ్రేణి నేతలకు యనమలే నేరుగా ఫోన్ చేస్తున్నారు.

పరిస్థితి ఎలా ఉంది? రాజకీయాలు ఎలా ఉన్నాయి? వాతావరణం ఎలా ఉంది? లాంటి ప్రశ్నలు వేస్తున్న వైనంతో పలువురు విస్మయానికి గురవుతుున్నారు. ఏనాడు ఫోన్ చేయని నేతలకు సైతం యనమలే నేరుగా ఫోన్ చేసి మాట్లాడటంతో వారు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకూ కారణం ఏమిటన్నది చూస్తే.. కుశల ప్రశ్నలు పూర్తి అయ్యాక.. ఈసారి ఎన్నికల్లో తన పెద్ద కుమార్తె దివ్యను ఎన్నికల బరిలో దింపాలని తాను భావిస్తునట్లుగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాను ఫోన్ చేసిన వారికి కూడా యనమల చెబుతున్నారు.

అయితే.. నేరుగా కాకుండా పరోక్షంగా ఆయన మాటలు ఉంటున్నట్లు చెబుతున్నారు. తునిలో తమ బలం చూపిద్దామని.. పెద్దమ్మాయిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. అయితే.. రాజకీయాల మీద యనమల పెద్ద కుమార్తె దివ్యకు పెద్ద ఆసక్తి లేదని.. అయితే తండ్రి మాట కాదనలేక ఆమె రంగంలోకి వస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె భర్త ఐఆర్ఎస్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. తుని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజాకు బలమైన ప్రత్యర్థిగా తన కుమార్తె నిలుస్తుందని యనమల భావిస్తున్నారు. మరి.. ఆయన ప్రయోగ ఫలితం ఎలా ఉంటుందో తేలటానికి మరికొంత కాలం పడుతుందని చెప్పకతప్పదు.