Begin typing your search above and press return to search.

వామ్మో.. ఇన్ని సూక్తులేంది యనమల?

By:  Tupaki Desk   |   11 March 2016 4:41 AM GMT
వామ్మో.. ఇన్ని సూక్తులేంది యనమల?
X
ప్రసంగాలు రక్తి కట్టటానికి కొన్ని కొటేషన్లు.. పలువురు ప్రముఖుల్ని చేసిన వ్యాఖ్యల్ని సందర్భోచితంగా ప్రస్తావించటం బాగుంటుంది. కానీ.. మోతాదు మించితే ఇబ్బందిగా ఉంటుంది. రుచిని పెంచుతుంది కదా అని మోతాదు పెంచితే ఏమవుతుందో.. తాజాగా ఏపీ బడ్జెట్ సందర్భంగా ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి చేసిన ప్రసంగం కూడా ఇంచుమించే ఇదే తీరుగా మారింది. దాదాపు 2.05 గంటల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంతో విపక్షాలతో పాటు.. టీవీల్లో బడ్జెట్ ప్రసంగాన్ని వింటున్న వారికి చిరాకు కలిగిన పరిస్థితి.

తన ప్రసంగంలో భాగంగా పలువురు ప్రముఖుల సూక్తుల్ని పదే పదే ప్రస్తావించారు యనమల. ఆరంభంలో కలాం మాటల్ని ప్రస్తావించిన ఆయన.. చివరిలో విల్ ఫెడ్ పీటర్సన్ సూక్తితో ముగించారు. మధ్యమధ్యలో యనమల చెప్పిన సూక్తుల్ని చూస్తే..

‘‘ఏదైనా సార్థకంగా నేర్చుకున్నప్పుడు సృజనాత్మకత వికసిస్తుంది. సృజనాత్మకత వికసించినప్పుడు ఆలోచన పరిమళిస్తుంది. ఆలోచన పరిమిళించినప్పుడు విజ్ఞానం వికసిస్తుంది. విజ్ఞానం పూర్తిగా ప్రకాశించినప్పుడు ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది’’ - అబ్దుల్‌ కలాం

‘‘ఏదైనా ఒక భావాన్ని స్వీకరించండి. ఆ భావాన్ని, ఆ ఆలోచనని మీ జీవిత సర్వస్వంగా మార్చుకోండి. దాని గురించే ఆలోచించండి. కల కనండి. దాని కోసమే జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ దేహంలో సమస్త అవయవాలూ ఆ భావంతో రగిలిపోనివ్వండి. ఆ ఒక్క భావానికి తప్ప మరే ఆలోచనకి చోటివ్వకండి. మీరు విజయం సాధించాలంటే ఇదే మార్గం’’ – వివేకానందుడు

‘‘నన్ను నన్నుగానే చిత్రించు. ఏ మాత్రం తక్కువ చేయొద్దు’’ - షేక్‌ స్పియర్‌

‘‘నిన్నటి దినాన్ని శోకిస్తూ చూడకు. అది తిరిగి రాదు, నేడు నీది, దాన్ని చక్కగా మెరుగు దిద్దుకో. మసక కమ్మిన రేపటి దినాన్ని స్వాగతించు. సాహసంతో, నిర్భయంగా’’ - హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్‌ ఫెలో

‘‘నిరాశావాది ప్రతి అవకాశంలోనూ ఇబ్బంది చూస్తాడు. కానీ.. ఆశావాది ప్రతి ఇబ్బందిలోనూ కొత్త అవకాశాన్ని చూస్తాడు’’ - విన్‌ స్టన్‌ చర్చిల్‌

‘‘నేలను దున్నే వారే అందరికన్నా విలువైన పౌరులు’’ - థామస్‌ జెఫర్‌ సన్‌

‘‘ఇప్పటికే పుష్కలంగా చేకూరిన వాళ్లకి మరింత చేకూర్చడం ప్రగతి అనిపించుకోదు. మన ప్రగతికి నిజమైన పరీక్ష నిరుపేదలకు మనమేదైనా తగినంతగా సమకూర్చామా లేదా అన్నదే’’ - ఫ్రాంక్లిన్‌ డి. రూజ్‌ వెల్ట్‌

‘‘మనం అభివృద్ధి సాధించాలంటే మహిళా సాధికారికతను మించిన సాధనం మరొకటి లేదు’’ - ఐక్యరాజ్యసమితి పూర్వ సెక్రటరీ జనరల్‌ (పేరు ప్రస్తావించ లేదు)

‘‘ మనం మన యువత కోసం భవిష్యత్తును నిర్మించలేం. కానీ భవిష్యత్తుకు తగ్గట్టుగా మన యువతను నిర్మించుకోగలం’’ - రూజ్‌ వెల్ట్‌

‘‘ఆదర్శవంతమైన సమాజం ప్రగతి శీలకంగా ఉండాలి. ఆ సమాజంలో ఒక చోట సంభవించిన పరివర్తన తక్కిన అన్నిచోట్లా పరివర్తనకు దారితీసే అవకాశాలతో నిండి ఉండాలి’’ - అంబేడ్కర్‌

‘‘తమ శిరస్సులు మేఘాల్లోనూ, తమ చరణాలు భూమి మీద ఆన్చి నడుస్తున్న స్వాప్నికులతో - విశ్వాసులతో - సాహసికులతో - సంతోష భరితులతో - ప్రణాళికావేత్తలతో - కర్మశీలురతో - విజేతలతో కలిసి చదవండి. వారి స్ఫూర్తి మీలో ఒక అగ్ని రగల్చనీయండి. తద్వారా మీరు చూస్తున్న దానికన్నా మరింత మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడానికి ప్రయత్నించండి’’ - విల్‌ ఫ్రెడ్‌ పీటర్‌ సన్‌

ఆనవాయితీగా చెప్పడం కాకపోతే అసలు బడ్జెట్లో సూక్తుల అవసరమే లేదు. కానీ అలవాటైపోయింది. చెబితే చెప్పారు కానీ మరీ ఇన్ని అవసరమా అని!