Begin typing your search above and press return to search.

పీకేపై టీడీపీ నేత‌ల దాడి మొద‌లైన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   17 Dec 2017 11:24 AM GMT
పీకేపై టీడీపీ నేత‌ల దాడి మొద‌లైన‌ట్టేనా?
X
టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్ కార‌ణంగానే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింద‌న్న విష‌యం ఏ ఒక్క‌రు కూడా కాద‌న‌లేని స‌త్య‌మే. నాటి ప‌రిస్థితిని ప‌క్కా అంచ‌నాలేసుకున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... ప‌వ‌న్ లాంటి అశేష జ‌నాభిమాన‌మున్న వ్య‌క్తి త‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తే త‌ప్పించి విజ‌యం సాధించ‌లేన‌ని గ్ర‌హించారు. ఆ స‌మ‌యంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా అంత‌గా క‌లిసివ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఓ వైపు బీజేపీతో పొత్తు పెట్టుకుని - మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ను రంగంలోకి దించేసిన చంద్ర‌బాబు... అప్ప‌టిదాకా ఉన్న అంచ‌నాల‌ను పటాపంచ‌లు చేస్తూ విజ‌యం సాధించేశారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ తో టీడీపీ మైత్రితోనే వ్య‌వ‌హ‌రిస్తోంది. ప‌వ‌న్ ప్ర‌శ్నించిన దాదాపు అన్ని అంశాల‌ను కూడా చంద్ర‌బాబు స‌ర్కారు ప‌రిష్క‌రిస్తూ వ‌స్తోంది. ఈ ప‌రిష్కారంలో మంచి స్పీడు కూడా క‌నిపించిన వైనం మ‌న‌కు తెలిసిందే.

అయితే మొన్నామ‌థ్య నాలుగు రోజుల పాటు ఏపీలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... పోల‌వ‌రం వ‌ద్ద మొద‌లెట్టి... ప్ర‌కాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ప‌డ‌వ ప్ర‌మాద బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించడంతో త‌న ప‌ర్య‌ట‌న‌ను ముగించారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ సర్కారుపై - చంద్ర‌బాబు కేబినెట్ లోని మంత్రుల‌పై ప‌వ‌న్ కాస్తంత ఘాటు కామెంట్లే చేశారు. అయితే ఆ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ పెద్ద‌గా స్పందించ‌లేద‌నే చెప్పాలి. పార్టీకి మిత్రుడిగా కొన‌సాగుతున్న ప‌వ‌న్‌ పై మాట్లాడేట‌ప్పుడు ఆచితూచి మాట్లాడాల‌న్న‌ పార్టీ అధినేత ఆదేశాల‌తోనే టీడీపీ నేత‌లు ప‌వ‌న్ వ్యాఖ్య‌లు త‌మ‌కు విన‌బ‌డ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే సెల‌వు దినం ఆదివారం ఇద్ద‌రు టీడీపీ నేత‌లు మాత్రం ప‌వ‌న్‌ ను టార్గెట్ చేస్తూ కాస్తంత ఘాటు కామెంట్లే చేశారు. ఆ ఇద్ద‌రు టీడీపీ నేత‌లు ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే.. ఒక‌రేమో బాబు కేబినెట్‌ లో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కాగా... మ‌రొక‌రు చాలా అన‌తి కాలంలోనే ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌.

తొలుత య‌న‌మ‌ల కామెంట్ల విష‌యానికి వ‌స్తే... పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్దేశిత స‌మ‌యంలోగా పూర్తి అవుతుంద‌ని త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని పవ‌న్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించిన య‌న‌మ‌ల‌... ఒక్క ప‌వ‌న్‌ కే కాకుండా ఏ ఒక్క‌రికి కూడా ఈ అనుమానాలు అవ‌స‌రం లేద‌ని ప‌రోక్షంగా ప‌వ‌న్‌కు చుర‌క‌లంటిం చేశారు. ఇక అనిత కామెంట్ల‌ను ప‌రిశీలిస్తే.. యువ నేత‌గా ఉన్న అనిత... య‌న‌మ‌ల మాదిరి సంయ‌మ‌నం పాటించ‌లేక‌పోయార‌నే చెప్పాలి. త‌మ పార్టీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే హ‌క్కు ప‌వ‌న్ కు ఉంద‌ని ఒప్పుకుంటూనే... ప‌వ‌న్‌ పై ఆమె ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు విష‌య ప‌రిజ్ఞానం లేని ప‌వ‌న్‌కు పోల‌వ‌రంపై మాట్లాడే అర్హ‌తే లేద‌ని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు పోల‌వ‌రం ప్రాజెక్టుపై ప‌వ‌న్‌ కు అవ‌గాహ‌న లేద‌ని ఆమె వ్యాఖ్యానించారు. పోలవ‌రంపై ఏమాత్రం అవ‌గాహ‌న లేని ప‌వ‌న్‌... చంద్ర‌బాబును ఎలా విమ‌ర్శిస్తార‌ని కూడా వ్యాఖ్యానించిన అనిత కాస్తంత క‌ల‌క‌లం రేపార‌నే చెప్పాలి. మ‌రి ఈ విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్ అండ్ కో గానీ, చంద్ర‌బాబు గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.