Begin typing your search above and press return to search.

వైఎస్ పేరుతో జ‌గ‌న్ ను టార్గెట్ చేయ‌టం ఆప‌వా య‌న‌మ‌ల‌!

By:  Tupaki Desk   |   28 Jun 2019 6:58 AM GMT
వైఎస్ పేరుతో జ‌గ‌న్ ను టార్గెట్ చేయ‌టం ఆప‌వా య‌న‌మ‌ల‌!
X
బుర్ర‌లో కాస్త గుజ్జు ఉన్నోళ్లు సైతం ఒత్తిడికి గురైన‌ప్పుడు ఉన్న తెలివి కాస్తా ఆవిరి అయిపోతుంటుంది. మొన్న‌టి వ‌ర‌కూ ప‌వ‌ర్ లో ఉండి చ‌క్రం తిప్పినోళ్లు కాస్తా షాకింగ్ ప‌రాజ‌యం ఎదురైన‌ప్పుడు నోట మాట రాదు. అందులో నుంచి బ‌య‌ట‌ప‌డే క్ర‌మంలో చురుగ్గా ఆలోచించ‌ని ప‌రిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితుల్లోనే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది య‌న‌మ‌ల తీరు చూస్తే.

త‌న‌కు తెలిసినంత విజ‌య ప‌రిజ్ఞానం మ‌రెవ‌రికీ తెలీద‌న్న‌ట్లుగా ఉంటుంది య‌న‌మ‌ల తీరు. అయితే.. అదంతా ఒక‌ప్ప‌టి విష‌య‌మ‌న్న విష‌యం ఇటీవ‌ల ఆయ‌న మాట‌లు వింటున్న వారికి అర్థ‌మ‌వుతోంది. జ‌గ‌న్ ను త‌ప్పు ప‌ట్టే క్ర‌మంలో సంబంధం లేని అంశాన్ని ముడి వేసి బ‌ద్నాం చేయాల‌న్న భావ‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. తాజాగా అలాంటి పనే చేసి మ‌రోసారి అడ్డంగా బుక్ అయ్యారు య‌న‌మ‌ల‌.

లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ ను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మించారంటూ నోటీసులు ఇచ్చిన నేప‌థ్యంలో య‌న‌మ‌ల మీడియా ముందుకు వ‌చ్చారు. ఆ భ‌వ‌నాన్ని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు క‌ట్టార‌ని.. అలాంట‌ప్పుడు ప్ర‌భుత్వం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు నాటి వైఎస్ స‌ర్కార్ ఎందుకు అనుమ‌తులు ఇచ్చింద‌న్న ప్ర‌శ్న‌ను సంధించారు.

య‌న‌మ‌ల మాట‌లు విన్నంత‌నే.. భ‌లే పాయింట్ ప‌ట్టాడే మ‌నోడు అన్న భావ‌న క‌లుగుతుంది. కానీ.. కాస్తంత లోతుగా ఆలోచిస్తే అందులో డొల్ల‌త‌నం ఇట్టే అర్థం కాక మాన‌దు. వైఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు అనుమ‌తులని చెబుతున్న య‌న‌మ‌ల‌..ఒక భ‌వ‌నం అనుమ‌తికి సంబంధించిన వివ‌రాలు ముఖ్య‌మంత్రే నేరుగా చూసుకోరు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు ఏమ‌ని బ‌దులిస్తారు?

ఇదొక్క‌టే కాదు.. ప్ర‌భుత్వం అన్న త‌ర్వాత వేలాది మంది ఉద్యోగులు ఉంటారు. అందులో కొంద‌రు త‌ప్పులు చేస్తారు. అలా చేసిన త‌ప్పుల్ని త‌ర్వాత వ‌చ్చిన స‌ర్కారు స‌రి చేస్తుంది. ఆ లెక్క‌న వైఎస్ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల్ని త‌ర్వాత ప‌వ‌ర్లోకి వ‌చ్చిన వారు లేదంటే.. చంద్ర‌బాబు స‌ర్కారు స‌రి చేయాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా ఒక అక్ర‌మ నిర్మాణంలో నివాసం ఉండ‌టాన్ని ఏమ‌నాలి?

అందునా రాష్ట్ర ముఖ్య‌మంత్రే ఉండ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? ఆ నిర్మాణం అక్ర‌మ‌ని పేర్కొంటూ విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు వ‌చ్చిన త‌ర్వాత వివ‌రాలు తెప్పించుకొని స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటే ఈ రోజు ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చేది కాదు క‌దా? మాజీ ముఖ్య‌మంత్రి నివాసం అక్ర‌మ క‌ట్ట‌డ‌మ‌ని తేలిన‌ప్పుడు ఉపేక్షించ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవ‌టాన్ని చూసి విప‌క్ష నేత‌లు సిగ్గుతో చితికిపోవాల్సింది.

అందుకు భిన్నంగా.. ఎదురుదాడి చేయ‌టం ఏమిట‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. చేసిన త‌ప్పున‌కు దొరికిన‌ప్పుడు మౌనంగా ఉంటే అంతో ఇంతో గౌర‌వం మిగులుతుంది. అందుకు భిన్నంగా అదే ప‌నిగా మాట్లాడితే ఉన్న మ‌ర్యాద పోతుంది. ఆ విష‌యాన్ని య‌న‌మ‌ల లాంటోళ్లు ఎప్పుడు గుర్తిస్తారో..?