Begin typing your search above and press return to search.

పయ్యావులకు దెబ్బేసిన యనమల

By:  Tupaki Desk   |   31 March 2017 8:27 AM GMT
పయ్యావులకు దెబ్బేసిన యనమల
X
కొందరిని దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి నాయకుల్లో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కూడా ఒకరు. మంచి వక్తగా పేరున్న ఈ సీనియర్ యంగ్ లీడర్ కు పదవులు అందినట్లే అంది చేజారిపోతున్నాయి. పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విధివశాత్తు ఓడిపోయారాయన. దీంతో కచ్చితంగా మంత్రి అవుతారని ఆశించిన ఆయనకు పదవి రాలేదు. అయినా.. అధినేత చలవతో ఎలాగోలా ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో మంత్రి పదవి కోసం మళ్లీ ట్రై చేశారు. కానీ.. లెక్కలు - సమీకరణాలు తేడాలు రావడంతో మంత్రి పదవి హామీ దొరకలేదు. కానీ.. ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే అని చంద్రబాబుకు కూడా మనసులో ఉండడంతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పారు. కానీ, తీరా ఆ సమయం వచ్చేసరికి అది కూడా అందేలా కనిపించడం లేదు. కారణమేంటంటే... ప్రస్తుత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తనవారికి ఆ పదవి ఇప్పించుకునేందుకు గాను చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెస్తుండడమే.

అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పయ్యావుల కేశవ్‌ ను శాసన మండలి ఉపాధ్యక్షుడిగా నియమిస్తారని బాగా ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో ఈక్వేషన్లు మారిపోతున్నాయి. ఉపాధ్యక్షుడి ఎంపికలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తనదైన శైలిలో పావులు కదిపి తన జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యంకు ఈ పదవీని దక్కించు కోవడంలో సఫలమయ్యారని తెలుస్తోంది.

బీసీల పార్టీగా తెదేపాకు ముద్ర పడిందని పదవుల్లో బీసీలతో పాటు కాపు సామాజిక వర్గానికి కూడా ఇక నుంచి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని యనమల గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన అంతరంగిక సమావేశంలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే మండలి ఉపాధ్యక్షుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో కేశవ్ కు మరోసారి ఆశాభంగమే మిగిలేలా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/