Begin typing your search above and press return to search.

కెసిఆర్ భజన యనమల చేయిస్తున్నాడా?

By:  Tupaki Desk   |   12 March 2018 5:21 PM GMT
కెసిఆర్ భజన యనమల చేయిస్తున్నాడా?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఒక రివాజుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు ఇచ్చి తీరాల్సిందే అంటూ కేసిఆర్ హూంకరించి నప్పుడు... ప్రజలు ఆయనకు ధన్యవాదాలు తెలిపి అభినందించడం అర్థం చేసుకోవచ్చు. మూడో కూటమి ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించి దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవం కాపాడుతానని... అన్ని రాష్ట్రాల తరఫున హస్తినలో గళం విప్పుతానని అన్న రోజున కూడా ఆయనకు అభినందనలు దక్కాయి. తాజాగా రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేయడంలో యాదవులకు ప్రాధాన్యమిచ్చి ఒక టికెట్ కేటాయించినందుకు ఏపీలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.

అయితే నారా చంద్రబాబు నాయుడి దృష్టిలో ఇలాంటి కేసీఆర్ సత్కారాలను యాదవుల ద్వారా ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వెనుక ఉండి చేస్తున్నారేమో అనే అనుమానం ఉన్న పలువురు భావిస్తున్నారు. యనమలకు- కేసీఆర్ కు చాలా మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా గతంలో కూడా యాదవులకు టిక్కెట్ ఇస్తానని చెప్పినప్పుడు విజయవాడలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు జరిగాయి. వీటి వెనుక యనమల ఉన్నారని ఆయన అనుచరులే ఈ కార్యక్రమం నిర్వహించారని ప్రచారం జరిగింది.

యనమల రామకృష్ణుడు కూడా రాజ్యసభ టిక్కెట్ కోసం చంద్రబాబు మీద తన శక్తివంచన లేకుండా ఒత్తిడి తెచ్చారు. మరోవైపు ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ బోర్డు ఇంకా ఇవ్వడంలేదని అసంతృప్తి కూడా ఉంది. వెరసి యాదవులకు చంద్రబాబు సర్కారు ఏమీ చేయడం లేదు... పొరుగున ఉన్న కేసీఆర్ చాలా చేసేస్తున్నారు ... అనే సంకేతాలు ఇవ్వడానికి ఇలాంటి పాలాభిషేకాలు జరుగుతున్నట్లుగా తెలుగుదేశం భావిస్తోంది. అదే నిజమైతే కనుక ఇలాంటి వ్యవహారాలు చంద్రబాబునాయుడు చాలా సీరియస్ గా తీసుకుంటారని పార్టీ పేర్కొంటున్నది.

భవిష్యత్తులో కేసీఆర్ తో కూడా పొత్తు పెట్టుకోడానికి చంద్రబాబునాయుడు సిద్ధంగానే ఉన్నారు. కానీ అలాంటి అభిప్రాయం ఉన్నత మాత్రాన.. తన రాష్ట్రంలో, పైగా తన నిర్ణయాలను దెప్పి పొడుస్తున్నట్లుగా.. కేసీఆర్ కు పాలాభిషేకాలు జరగడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని పలువురు అనుకుంటున్నారు.