Begin typing your search above and press return to search.

యనమల తొండి వాదన..బాబు హామీ జగన్ అమలు చేయాలట!

By:  Tupaki Desk   |   26 Sep 2019 3:55 PM GMT
యనమల తొండి వాదన..బాబు హామీ జగన్ అమలు చేయాలట!
X
టీడీపీ సీనియర్ నేత - ఏపీ ఆర్థిక శాఖ తాజా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వినిపిస్తున్న వాదనను నిజంగానే తొండి వాదన అనే చెప్పక తప్పదు. ఎందుకంటే... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని ఇప్పుడు ఏపీకి కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టాలని యనమల డిమాండ్ చేస్తున్నారు. అయినా టీడీపీ ఇచ్చిన హామీని టీడీపీ సర్కారు కాకుండా వైసీపీ సర్కారు ఎలా అమలు చేసి తీరుతుందన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా నిలుస్తోంది. టీడీపీ ఇచ్చిన హామీని టీడీపీ పాలనలో ఐదేళ్ల పాటు పాలన సాగించిన చంద్రబాబు సర్కారు అమలు చేయలేకపోగా... ఇప్పుడు తామిచ్చిన హామీని జగన్ సర్కారు అమలు చేయాలని డిమాండ్ చేయడమంటే తొండి వాదన వినిపిస్తున్నట్టే కదా.

అంతేకాదండోయ్... 2019 ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో చంద్రబాబు కాళ్లకు చక్రాలు కట్టుకున్న మాదిరి రాష్ట్రమంతా తిరిగి 2014 ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసినట్లుగా ప్రచారం చేశారు కదా. రైతు రుణమాఫీని కూడా అమలు చేసి పారేశామని, రుణమాఫీలో పెండింగ్ లో ఉన్న నాలుగు - ఐదు విడతల నిధులను రెడీ చేశామని చెప్పుకొచ్చారు కూడా. ఎన్నికలు ముగియగానే ఈ రెండు విడతల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కూడా చెప్పిన వైనం కూడా మరిచిపోలేనిదే. అంతేనా రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేసేశామని - కొత్తగా అన్నదాతా సుఖీభవ పేరిట కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకున్నారు. ఈ ప్రచార అర్భాటంతో మరోమారు గెలిచి తీరతామని కూడా టీడీపీ భావించింది. అయితే ఎన్నికల్లో ఫలితాలన్నీ టీడీపీకి దిమ్మతిరిగిపోయేలా చేయడంతో చంద్రబాబు మాజీ సీఎం అయిపోగా, జగన్ సీఎం అయిపోయారు.

ఇప్పుడు జగన్ సర్కారు రైతు రుణమాఫీ జీవోలను కొట్టేయడంతో యనమల రంగంలోకి దిగారు. రైతు రుణమాఫీని ఎలా తీసేస్తారంటూ తనదైన శైలి ప్రశ్నలు సందించారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీనే అయినా రైతు రుణమాఫీని జగన్ సర్కారు అమలు చేసి తీరాల్సిందేనని కూడా యనమల డిమాండ్ చేశారు. అయినా సగం అమలు అయిన పథకాన్ని పూర్తి చేయకుండా ఎలా రద్దు చేస్తారంటూ కూడా యనమల లాజిక్ లాగారు. ఇక్కడే యనమల బోల్తా కొట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే... ఎన్నికల ప్రచారంలో రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేశామని చంద్రబాబు చెబితే... ఆయన కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న యనమల ఇప్పుడేమో సగం పథకాన్ని మాత్రమే తాము అమలు చేశామని చెప్పి... రైతు రుణమాఫీ హామీ అమలును తాము పూర్తిగా అమలు చేయలేదన్న విషయాన్ని జనం ముందు ఒప్పుకున్నట్టైందన్న విశ్లేషణలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. మొత్తంగా టీడీపీ హామీని జగన్ అమలు చేసి తీరాలన్న డిమాండ్ ను వినిపించిన యనమల... చంద్రబాబు, లోకేశ్ ల మాదిరే జనం ముందు కామెడీ పీస్ అయిపోయారని చెప్పక తప్పదు.