Begin typing your search above and press return to search.

మండ‌లి ర‌ద్దు.. ఈజీ కాదంటున్న య‌న‌మ‌ల‌!

By:  Tupaki Desk   |   24 Jan 2020 6:07 AM GMT
మండ‌లి ర‌ద్దు.. ఈజీ కాదంటున్న య‌న‌మ‌ల‌!
X
ఏపీ ప్ర‌భుత్వం శాస‌న‌మండ‌లి ర‌ద్దు గురించి గ‌ట్టిగానే ఆలోచ‌న చేస్తూ ఉన్న‌ట్టుగా స్ప‌ష్టం అవుతూ ఉంది. ఈ విష‌యంపై సోమ‌వారం ఏదో ఒక‌టి తేలిపోవ‌చ్చు. అస‌లు మండ‌లి అవ‌స‌ర‌మా? అంటూ ముఖ్య‌మంత్రి ప్ర‌శ్న‌లు సంధించారు. ప్ర‌జల చేత ఎన్నికైన ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను అడ్డుకునే మండ‌లి అవ‌స‌ర‌మా అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డంతో.. మండ‌లి ర‌ద్దు అనే ఊహాగానాలు ఏర్ప‌డ్డాయి. మండ‌లి ర‌ద్దు చేయ‌డం ద్వారా తెలుగుదేశం పార్టీకి జ‌గ‌న్ గ‌ట్టి ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతున్నార‌ని మీడియాలో హ‌డావుడి జ‌రుగుతూ ఉంది.

అయితే శాస‌న‌మండ‌లి ర‌ద్దు అంత తేలిక కాదు.. అంటున్నార‌ట తెలుగుదేశం నేత‌, టీడీపీ ఎమ్మెల్సీ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. ఒక‌వేళ శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. సోమ‌వారం ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసినా.. అంత‌టితో మండ‌లి ర‌ద్దు అయిపోదంటున్నార‌ట ఆయ‌న‌. మండ‌లిని ర‌ద్దు చేయ‌డానికి శాస‌న స‌భ తీర్మానం చాల‌ద‌ని, దానికి కేంద్ర ప్ర‌భుత్వ ఆమోదం కావాల‌ని ఆయ‌న అంటున్నార‌ట‌. ఢిల్లీలోని ఉభ‌య స‌భ‌ల్లో ఆమోదం పొందిన త‌ర్వాతే ఏపీలో మండ‌లి ర‌ద్దు అవుతుంద‌ని చెబుతున్నార‌ట ఆయ‌న‌.

అయితే దానికి స‌హ‌జంగానే స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చనేది య‌న‌మ‌ల లాజిక్. ఇప్ప‌టికే రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్లిన వివిధ తీర్మానాలు పెండింగ్ లో ఉంటాయ‌ట‌. అలాంటి వాటిల్లో ఏపీ మండ‌లి ర‌ద్దు తీర్మానం కూడా ఒక‌టి అవుతుంద‌ట‌. కేంద్రం వాట‌న్నింటి మీద నిర్ణ‌యాలు తీసుకునే స‌రికి క‌నీసం ఆరు నెలల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. దీంతో.. ఆరు నెల‌ల వ‌ర‌కూ మండ‌లి ఉనికిలో ఉంటుంద‌ని య‌న‌మ‌ల వాదిస్తూ ఉన్నార‌ట‌.

అసెంబ్లీ తీర్మానం ఆమోదం పొందే వ‌ర‌కూ మండ‌లి ఉంటుంద‌ని, తాము ఎమ్మెల్సీలుగా కొన‌సాగ‌వవ‌చ్చు అనేది య‌న‌మ‌ల లాజిక్. కాబ‌ట్టి మండ‌లి ర‌ద్దు తేలిక కాబోద‌ని ఆయ‌న చెబుతున్నార‌ట‌. అయితే మండ‌లి వికేంద్రీక‌ర‌ణ బిల్లును అడ్డుకున్నా.. అది మూడు నెల‌లు మాత్ర‌మే. కానీ మండ‌లిని ర‌ద్దు చేయాలంటే ఆరు నెల‌ల స‌మ‌యం ప‌ట్టేలా ఉంది య‌న‌మ‌ల వాద‌న ప్ర‌కారం. ఇలాంటి నేప‌థ్యంలో... ఏపీ ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో ఆస‌క్తిదాయ‌కంగా మారింది.