Begin typing your search above and press return to search.

రోజా గురించి య‌న‌మ‌ల ఏమ‌న్నారంటే...

By:  Tupaki Desk   |   2 Sep 2016 4:25 PM GMT
రోజా గురించి య‌న‌మ‌ల ఏమ‌న్నారంటే...
X
తెలుగు రాష్ట్రాల్లో సంచల‌నం సృష్టించిన కాల్ మ‌నీ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప‌రుష ప‌దాల‌తో కామెంట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎపిసోడ్‌ లో ఏపీ ఆర్థిక‌ - శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆచితూచి స్పందించారు. శాసనసభలో రోజా కామెంట్ల‌తో వివాదం చెల‌రేగి స్పీకరు కోడెల ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా రోజా క్ష‌మాప‌ణ‌లు కోరిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను య‌న‌మ‌ల లైట్ తీసుకున్నారు. రోజా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన విష‌యం స‌భ దృష్టికి వ‌స్తే....ఎమ్మెల్యే హోదాలో చేసిన ఈ కామెంట్ల‌పై కోర్టు మార్గదర్శకాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని యనమల రామకృష్ణుడు చెప్పారు. స‌భ నిబంధ‌న‌లు, న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం ఉంటుంద‌ని తెలిపారు.

ఓటుకు నోటు కేసులో హైకోర్టు స్టే విధించడంతో యనమల మీడియాతో మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడేందుకు న్యాయస్థానాలున్నాయని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు న్యాయబద్దంగా పిటిషన్‌ వేసినందుకు కోర్టు స్టే ఇచ్చిందని అన్నారు. తప్పుడు ఆరోపణలతో ఇష్టానుసారం న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదని య‌న‌మ‌ల సూచించారు. వ్య‌క్తిగ‌త‌ ఆరోపణలతో కోర్టును ఆశ్రయించకూడదనే స్టే ఇచ్చిందని పేర్కొన్నారు. ఇదిలాఉండ‌గా టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవినీతి మచ్చలేని వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని అన్నారు. ఓటుకు నోటు కేసులో హైకోర్టు తీర్పు వైసీపీకి చెంపపట్టు లాంటిదని దుయ్యబట్టారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలు న్యాయస్థానాల్లో చెల్లవన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించ‌డం త‌మ మొద‌టి విజ‌య‌మ‌ని అన్నారు.