Begin typing your search above and press return to search.

య‌న‌మ‌ల స‌భ‌లో చేసిన పెద్ద త‌ప్పేంటి?

By:  Tupaki Desk   |   20 Dec 2015 8:58 AM GMT
య‌న‌మ‌ల స‌భ‌లో చేసిన పెద్ద త‌ప్పేంటి?
X
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్‌ కె రోజాను అసెంబ్లీనుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయడం వివాదాస్పదమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నెపంతో ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించగా, మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె సస్పెన్షన్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన య‌న‌మ‌ల స‌భా నిబంధ‌న‌ల‌ను స‌రిగ్గా పాటించకపోవడం వివాదం కావడానికి కారణంగా మారింది.

ఏపీ మంత్రుల్లో సీనియ‌ర్ అయిన య‌న‌మ‌ల రామకృష్ణుడు అసెంబ్లీ రూల్స్‌, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ లో నిష్ణాతుడు. స్పీకర్, శాస‌న‌భా వ్య‌వ‌హారాల మంత్రిగా గ‌తంలో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక - శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఉన్నయనమల ఇంత తెలిసి స్వయంగా తప్పిదం చేశారని సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కులు వివ‌రిస్తున్నారు. అసెంబ్లీ రూల్స్ 340(2) ప్రకారం య‌న‌మ‌ల‌ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, ఏడాదిపాటు సస్పెండ్ చేయాల్సిందిగా స్పీకర్‌ ను కోరారు. వెంటనే తెదేపా - భాజపా ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ఆమోదించారు. ఈమేరకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు కూడా తీర్మానాన్ని ఆమోదమైందని, రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే వివాదానికి కార‌ణ‌మైన‌ కిటుకంతా ఇక్కడే ఉంది. మంత్రి రామకృష్ణుడు పేర్కొన్న రూల్ ప్రకారమైతే అసెంబ్లీ సభ్యురాలైన వారు ఎవ‌రినైనా ఆ నిర్ణ‌యం కేవలం ఆ సమావేశాల వరకే వర్తిస్తుంది. అంటే కొనసాగుతున్న సమావేశాలు ముగిసేంత వరకే అమలవుతుంది. తర్వాత సస్పెన్షన్ అమల్లో ఉండదు. ఇదే విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెబుతున్నా ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. ఒక‌వేళ‌ ఏడాది లేదా మ‌రెంత కాలమైనా సస్పెండ్ చేసే అధికారం అసెంబ్లీకి, స్పీకర్‌కు ఉన్నప్పుడు, అసెంబ్లీ రూల్స్ పుస్తకంలోని ఆ రూల్‌ను రామకృష్ణుడు చదవకుండా ఉండి ఉంటే ఇప్పుడు వివాదానికి ఆస్కారం ఉండేది కాదని చెప్తున్నారు. ఇపుడు స‌భ‌లో చెప్పిన నిబంధ‌న‌ల ఆధారంగా రాష్ర్ట‌ప‌తికి ఫిర్యాదుచేసేందుకు వైఎస్ జ‌గ‌న్ స‌హా ఆ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో య‌న‌మ‌ల రామకృష్ణుడు అన్నీ తెలిసి సంద‌ర్భానికి స‌రిపోని నిబంధ‌న‌తో స‌స్పెన్ష‌న్ తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డం టీడీపీని ఇరుకున పెట్టే దిశ‌కు దారితీసింద‌ని తెలుగుదేశం వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.