Begin typing your search above and press return to search.

రోజాపై కొత్త రూట్‌ లో మ‌రో ఏడాది స‌స్పెన్ష‌న్‌!

By:  Tupaki Desk   |   8 March 2017 12:04 PM GMT
రోజాపై కొత్త రూట్‌ లో మ‌రో ఏడాది స‌స్పెన్ష‌న్‌!
X
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాది సస్పెన్షన్ వేటు తప్పదనే రీతిలో వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ అనుమానం నిజమేననిపిస్తోంది. ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరైన రోజా ఇచ్చిన వివరణతో కమిటీ సంతృప్తి చెందక పోవటంతో ఆ కమిటీ చేసిన సిఫార్సులపై మార్చి 13న సభలో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈసారి రోజా సస్పెన్షన్ విషయంలో ప‌క‌డ్బందీ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు చెప్తున్నారు. రోజా కోర్టుకు వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.

వైసీపీ త‌ర‌ఫున రోజా మాట్లాడుతూ సూటిగా నిల‌దీయ‌డం - అందులోనూ సీఎం చంద్ర‌బాబుపై ల‌క్ష్యంగా విమర్శలు చేస్తుండటంతోపాటు, పరుష పదజాలం వాడటాన్ని నాయకత్వం భరించలేకపోతోంది. రోజా సభలో ఉండకూడదని, ఉంటే రోజాను నిలువరించేందుకే ఉన్న సమయమంతా కేటాయించాల్సి వస్తోందన్న భావన నాయకత్వంలో ఉంది. అందువల్ల మరో ఏడాది సస్పెండ్ చేస్తే సభ ప్రశాంతంగా జరుగుతుందన్న భావనలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈనెల 13న సభలో ఆమె వ్యవహారంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ క్ర‌మంలో రోజా తన ప్రవర్తనకు కచ్చితంగా క్షమాపణ చెబితేనే ఆమెను సభకు అనుమతించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆమె క్షమాపణలో నిజాయితీ కనిపించాలని, అందులో షరతులు ఉండరాదన్న భావనతో ఉన్నారు. ఇదే విషయాన్నిమీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప‌రోక్షంగా వివ‌రించారు. రోజా క్షమాపణ చెప్పాల్సిందేనని, అందులో షరతులు ఉండరాదని అన్నారు. సభా హక్కుల కమిటీ నివేదిక ఇస్తుందని, దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. దీన్నిబట్టి రోజా తప్పనిసరిగా క్షమాపణ చెబితేనే ఆమెను సభకు అనుమతిస్తారన్న విషయం స్పష్టమవుతోంది. మ‌రోవైపు రోజాపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే అనితతో మాట్లాడిస్తారని చెప్తున్నారు. రోజా తనను దూషించిన వ్యవహారంలో ఆమె క్షమాపణ చెప్పిన వైనంపై సభ సంతృప్తి చెందినా, తాను సంతృప్తి చెందే సమస్య లేదని, తనను అవమానించిన రోజాపై సస్పెన్షన్ వేటు వేయాల్సిందేనని ఆమె పట్టుపట్టే అవకాశం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/