Begin typing your search above and press return to search.

య‌న‌మ‌ల‌ పై రేవంత్ ఆవేద‌న‌లో నిజ‌ముందండోయ్‌!

By:  Tupaki Desk   |   5 Nov 2017 11:10 AM GMT
య‌న‌మ‌ల‌ పై రేవంత్ ఆవేద‌న‌లో నిజ‌ముందండోయ్‌!
X
తెలంగాణ‌లో టీడీపీని స‌ర్వ నాశ‌నం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్న టీఆర్ఎస్ అధినేత‌, ఆ రాష్ట్ర సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఓ వ్యూహం ప్ర‌కారం అడుగులు వేస్తుంటే... ఇవేవీ ప‌ట్ట‌ని ఏపీకి చెందిన టీడీపీ నేత‌ల‌ను ఆయ‌నను కీర్తిస్తూ, ఆయ‌న‌తో స్నేహం కొన‌సాగిస్తూ ఉండ‌టం ఏమిట‌నేది యువ నేత రేవంత్ రెడ్డి ప్ర‌శ్న‌. ఈ కార‌ణంగానే తాను టీ టీడీపీకి రాజీనామా చేస్తున్నాన‌ని చెప్పి... ఏకంగా ఆ పార్టీకి రేవంత్ పెద్ద షాకే ఇచ్చారు. కోర్టు ప‌నుల నిమిత్తం ఢిల్లీ వెళుతున్నాన‌ని చెప్పిన రేవంత్ రెడ్డి... చాటుగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌ల‌వ‌డంతో తెలుగు నాట రాజ‌కీయాల్లో పెను క‌ల‌క‌ల‌మే రేగింది. అయితే త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌హాటంగానే బ‌య‌ట‌పెట్టేసిన రేవంత్ రెడ్డి... రాజ‌కీయ వైరం క‌లిగిన టీఆర్ఎస్ నేత‌లు, ఆ పార్టీ నేతృత్వంలోని తెలంగాణ స‌ర్కారుతో ఏపీకి చెందిన టీడీపీ నేత‌లు ఎలా మైత్రి కొన‌సాగిస్తార‌ని కూడా నిల‌దీశారు. అస‌లు తెలంగాణ స‌ర్కారుతో దోస్తీ చేస్తూ కాంట్రాక్టులు ద‌క్కించుకుంటూ... త‌మ‌ను మాత్రం కేసీఆర్‌పై పోరాడ‌మంటే ఎలాగంటూ కూడా ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలో కేసీఆర్ తో ఏపీకి చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌లు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, ప‌రిటాల సునీత‌, ప‌య్యావుల కేశ‌వ్ త‌దిత‌రులకు ప్ర‌త్య‌క్ష సంబంధాలున్నాయ‌ని, కేసీఆర్‌తో వీరంతా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారాలు చేసుకుంటున్నార‌ని రేవంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై ప‌య్యావుల‌, ప‌రిటాల మాట ఎలా ఉన్నా... య‌న‌మ‌ల మాత్రం ఘాటుగానే స్పందించారు. కేసీఆర్‌తో తాను తీసుకుంటున్న‌ట్లుగా చెబుతున్న కాంట్రాక్టుల‌ను నిరూపిస్తే... వాట‌న్నిటిని కూడా రేవంత్‌కు రాసిస్తాన‌ని య‌న‌మ‌ల పెద్ద‌రికం చూపారు. అయితే ఆ త‌ర్వాత రేవంత్ టీడీపీకి రాజీనామా చేయ‌డం, కాంగ్రెస్‌లో చేరిపోవ‌డం జ‌రిగిపోయింది. ఇదంతా గ‌త‌మైతే... తాజాగా య‌న‌మ‌ల వ్య‌వ‌హ‌రించిన తీరు చూస్తే... రేవంత్ ఆవేద‌న‌లో వాస్త‌వ‌ముంద‌నే చెప్పాలి. ఎందుకంటే... టీ టీడీపీని జీరో స్థాయికి ప‌డేసిన కేసీఆర్ చాలా గొప్పోడంటూ య‌న‌మ‌ల పొగిడారు. అది కూడా యాద‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి స‌న్నిధి సాక్షిగా.. య‌న‌మ‌ల నోటి నుంచి పొగ‌డ్త‌లు వినిపించ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌లోని యాదాద్రిని య‌న‌మ‌ల త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మీన‌ర‌సింహుడి ద‌ర్శ‌నం అనంత‌రం ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడిన య‌న‌మ‌ల‌... కోట్లాది రూపాయ‌ల‌తో యాదాద్రిని అభివృద్ది చేస్తున్న కేసీఆర్ నిజంగానే అభినంద‌నీయుడ‌ని పేర్కొన్నారు. దేవాలయాలను అభివృద్ది చేయడమంటే చరిత్రను కాపాడటమే అన్నారు. అలాగే రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని, యాదాద్రి దేవస్థానానికి గొప్ప సైకలాజికల్ చరిత్ర ఉందన్నారు. ఏపీకి తిరుమల వలే తెలంగాణకు యాదాద్రి క్షేత్రం తలమానికంగా నిలవాలని ఆశిస్తున్నానని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉందని య‌న‌మ‌ల వ్యాఖ్యానించారు. ఆల‌యాల ప్రాశ‌స్త్యం గురించైతే ఓకేగాని... ఏకంగా కేసీఆర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ య‌న‌మ‌ల వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.