Begin typing your search above and press return to search.

ఇక వేసేయండి.. బాబుపై యనమల ఒత్తిడి!

By:  Tupaki Desk   |   10 March 2018 6:11 AM GMT
ఇక  వేసేయండి.. బాబుపై యనమల ఒత్తిడి!
X
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు.. భాజపా భారాన్ని వదిలించుకున్న తరువాత.. ముమ్మరమైన సొంత రాజకీయ కసరత్తులను ప్రారంభించింది. ఆ పార్టీకి ఇప్పుడు రాజకీయ అవసరాలు ఒత్తిడులు చాలా ఉన్నాయి. తక్షణం అయితే ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన అవసరం కూడా ఉంది. సోమవారం నామినేషన్లకు ఆఖరు. ఎటూ మూడో సీటు మీద ఆశ లేదు గనుక.. ఇద్దరిని ఎంపిక చేస్తే.. ఎటూ టెన్షన్ లేకుండా.. ఓ పర్వం ముగిసిపోయినట్టే.

ఆ తరువాత.. రాష్ట్రంలో మిగిలిఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద చంద్రబాబు దృష్టి సారించబోతున్నట్లుగా తెలుస్తోంది. వీటిలో ప్రప్రథమంగా తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు కూర్పు ఉండవచ్చునని అంతా అనుకుంటున్నారు. తన వియ్యంకుడికి ఛైర్మన్ గిరీ ఇప్పించాలని చూస్తున్న మంత్రి యనమల రామకృష్ణుడు వెంటనే బోర్డు ప్రకటన చేసేయవచ్చునని. భాజపా ఒత్తిడులు కూడా లేవు గనుక జీవో వెంటనే ఇచ్చేస్తే పోతుందని చంద్రబాబు పై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ తెగతెంపులతో చంద్రబాబుకు కాస్త భారం తగ్గిందని అనుకోవాలి. ఉన్న నామినేటెడ్ పదవుల్లో కమల నాయకులకు కూడా కొంత వాటా పంచాలనే పట్టింపు ఇక ఎంతమాత్రమూ లేదు. ఎన్ని పదవులుంటే.. అన్నింటినీ.. తమ పార్టీ వారికే పంచి పెట్టుకోవచ్చు. అచ్చంగా పార్టీకి ఉపయోగపడగల వారు ఎవరున్నారో.. వారందరినీ ఏరి ఏరి పదవుల్లో కూర్చోబెట్టవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం ఒక్కటే రాష్ట్రంలో భాజపా తో బంధం గానీ, భారం గానీ లేని పార్టీగా మిగిలింది గనుక.. యథేచ్ఛగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసుకోవచ్చుననే ప్రణాళికలు ఆ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి.

రాజ్యసభ సీటుకోసం యనమల ఆశ కూడా ఉన్నది గానీ. రెండే సీట్లు దక్కుతున్న నేపథ్యంలో ఆయనకు ఎంపీ పదవి ఇవ్వలేక, ఆయన వియ్యకుండికి టీటీడీ ఛైర్మన్ ఇవ్వడమే బెటరని చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచారం. ఇన్నాళ్లూ మూడు టీటీడీ సభ్యత్వ పదవులకోసం బీజేపీ పట్టుపట్టిందని.. ఇప్పుడు వారితో నిమిత్తం లేదు గనుక.. వెంటనే బోర్డు వేస్తే పోతుందని ప్రతిపాదనలు వస్తున్నట్లు సమాచారం.