Begin typing your search above and press return to search.

అపార్ట్‌మెంట్లు దొరికినా వెళ్లిపోతున్నామంటున్నారు

By:  Tupaki Desk   |   12 Jun 2015 12:44 PM GMT
అపార్ట్‌మెంట్లు దొరికినా వెళ్లిపోతున్నామంటున్నారు
X
ఓటుకు నోటలో వీడియో ఎఫెక్టో.. ఏపీ సీఎం చంద్రబాబుగా చెబుతున్న ఆడియో సీడీ పుణ్యమో.. లేక ట్యాపింగ్‌ తిప్పలో కానీ.. ఏపీ రాష్ట్ర సర్కారు హైదరాబాద్‌ నుంచి తట్టాబుట్టా సర్దేసుకోవటానికి సిద్ధమవుతోంది. పరువు మొత్తం పోగొట్టుకొని.. కేంద్రాన్ని గుప్పిట్లో పెట్టుకొని కథను నడిపించే స్థాయి నుంచి పాహిమాం.. పాహిమాం అంటూ ఢిల్లీకి పరుగులు పెట్టే దుస్థితి విషయంలో ఆత్మావలోకనంలోకి పడిపోయారేమో కానీ.. తెలుగుతమ్ముళ్లు ఇప్పుడు విజయవాడ వైపు పరుగులు పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు.

హైదరాబాద్‌ నుంచి పదేళ్లు అధికారికంగా ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ.. ఇక ఇక్కడ ఉండటం ఏ మాత్రం సురక్షితం కాదన్న విషయం ఎరుకలోకి వచ్చేసినట్లుంది. తన శిష్యురికంలో పెరిగి పెద్దవాడైన కేసీఆర్‌.. దాదాపు పద్నాలుగేళ్లు విడిగా ఉంటూ.. తనదైన శైలిలో కథను నడిపించే సత్తా ఉండటమే కాదు.. ఎత్తులు వేసే విషయంలో.. వ్యూహాలు పన్నటంలో గురువుకు మించిన శిష్యుడన్న విషయం ఇప్పుడిప్పుడే చంద్రబాబుకు అర్థమవుతున్నట్లుంది.

అందుకే.. హైదరాబాద్‌ మీద భ్రమలు తొలిగించుకొని.. తమ సొంతమైన బెజవాడ బెటర్‌ అన్న ఉద్దేశంలోకి వచ్చేసినట్లున్నారు. దానికి ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.

అడుగు తీసి అడుగు వేయాలంటే అనుమతులతో పాటు.. ఏ క్షణంలో.. ఎలాంటి ముప్పు విరుచుకుపడుతుందో తెలీని అపనమ్మకంతో పాటు.. తమది కాని ప్లేస్‌లో తాము ఎక్కువ కాలం మనుగడ సాధించలేమన్న విషయం తమకు అర్థమైందన్న విషయం యనమల మాటల్లో స్పష్టంగా వినిపించింది. నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని విజయవాడలో అద్దెకు అపార్ట్‌మెంట్లు దొరికితే.. అందులో నుంచి పాలన సాగించేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

విజయవాడ నుంచి పాలన సాగించేందుకు ఏ మాత్రం అవకాశం ఉన్నా.. హైదరాబాద్‌లో ఒక్క క్షణం కూడా ఉండమని తేల్చేశారు. ఇప్పుడు కళ్లు తెరిచే బదులు.. అధికారంలోకి వచ్చిన మరుక్షణం.. వాటికి వీటికి సుందరీకరణ కోసం పెట్టే దృష్టి.. విజయవాడ సమీపంలో భారీ ఎత్తున అపార్ట్‌మెంట్లు నిర్మించుకుంటే.. అన్నింటికి అక్కరకు వచ్చేవి కదా. దిమ్మ తిరిగిపోయి.. మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా పంచ్‌ ఇచ్చే వరకూ హైదరాబాద్‌ మీద ఉన్న భ్రమలు తీరిపోలేదని విమర్శకులు వ్యాఖ్యాయనిస్తున్నారు. మరి.. విజయవాడలో యనమల కోరుకున్నట్లు అపార్ట్‌మెంట్లు ఉన్నాయా..?