Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రుల‌కు య‌న‌మ‌ల షాక్‌

By:  Tupaki Desk   |   14 Aug 2015 9:29 AM GMT
ఏపీ మంత్రుల‌కు య‌న‌మ‌ల షాక్‌
X
ఏపీ కేబినెట్ మంత్రుల‌కు ఆర్థిక శాఖా మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు పెద్ద షాకే ఇచ్చారు. రాష్ర్ట విభ‌జ‌న త‌ర్వాత ఏపీ భారీ ఆర్థిక‌లోటులో కూరుకుపోవ‌డంతో ప్ర‌భుత్వం పొదుపు మంత్రం పాటిస్తోంది. చాలా ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుంటున్నారు. ఈ పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగానే మంత్రులు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు లేదా ఇత‌ర ప‌నుల కోసం స్టార్ హోటల్స్ లో బ‌సచేయకుండా నిషేధం విధించిన‌ట్టు య‌న‌మ‌ల చెప్పారు. మంత్రులు ప్ర‌భుత్వ అతిథి గృహాల్లో మాత్ర‌మే ఉండాల‌ని..అన్ని ప్ర‌భుత్వ అతిథి గృహాల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని ఆర్ అండ్ బీ అధికారుల‌ను కూడా ఆదేశించారు.

అలాగే ఉన్న‌తాధికారుల నివాసాల కోసం అద్దె రేట్ల‌ను కూడా స‌వ‌రించారు. హైద‌రాబాద్‌ లో నివాసం ఉంటున్న ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులంద‌రూ రెండు నెల‌ల్లో విజ‌య‌వాడ‌కు త‌ర‌లిరావాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. వారు నివాసం ఉండేందుకు ఇళ్లు, వారి కార్యాల‌యాల ఏర్పాట్ల‌ ను జ‌వ‌హ‌ర్ క‌మిటీ ప‌ర్య‌వేక్షిస్తోంద‌న్నారు.

మంత్రులు త‌మ స‌మీక్ష‌ల‌కు టూరిజం థరమ్‌ పార్కు, సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న స‌మావేశ మందిరాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని య‌న‌మ‌ల చెప్పారు. హ‌డ్ కో ఆధ్వ‌ర్యంలో ప‌దివేల ఇళ్ల‌ను ఉద్యోగుల కోసం నిర్మిస్తామ‌న్నారు.

అస‌లు అంతంత మాత్రంగా ఉన్న ఏపీ ఖ‌జానాకు మంత్రుల దుబారాలు మ‌రింత భారం కాకుండా ఉండేందుకు ఏపీ స‌ర్కార్ మంచి నిర్ణ‌య‌మే తీసుకుంది. ఇప్ప‌టికే ప‌రిటాల సునీత ఇదే విష‌య‌మై ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ త‌ర్వ‌లోనే తాను విజ‌య‌వాడ‌లో ఓ ఇళ్లు తీసుకుని అక్క‌డే నివాసం ఉంటాన‌ని..త‌న‌కో కార్యాల‌యం కూడా ఏర్పాటు చేసుకుని అక్క‌డి నుంచే కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తాన‌ని... ప్ర‌భుత్వ సొమ్మును దుర్వినియోగం చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పారు. మ‌రి మిగిలిన మంత్రులు కూడా ఆమెను ఆద‌ర్శంగా తీసుకుంటార‌ని ఆశిద్దాం.