Begin typing your search above and press return to search.

న‌మ్మండి ప్లీజ్ః ఏపీ మంత్రి వ‌ర్గంలో అంతా ఓకే

By:  Tupaki Desk   |   25 Jun 2017 9:45 AM GMT
న‌మ్మండి ప్లీజ్ః ఏపీ మంత్రి వ‌ర్గంలో అంతా ఓకే
X
ఏపీ మంత్రివ‌ర్గంలోని అమాత్యుల్లో కొంద‌రి మ‌ధ్య లుక‌లుక‌లు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు సీనియ‌ర్ల మ‌ధ్య అంత‌ర్గతంగా నెల‌కొన్న విబేధాలు తారాస్థాయికి చేరాయని జోరుగా చ‌ర్చించుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్గంలో అసమ్మతి లేదని స్పష్టం చేశారు. నాయకుడు తన బృందానికి దిశానిర్దేశం చేయడం నియంతృత్వమా అని యనమల ప్రశ్నించారు. మంత్రిమండలి - కార్య నిర్వహణ వ్యవస్థకు మధ్య పూర్తి సమన్వయం ఉందని ఆయన చెప్పారు. మంత్రివర్గంలో అసంతృప్తి ఉన్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, అది వాస్తవం కాదని య‌న‌మ‌ల పున‌రుద్ఘాటించారు.

మూడేళ్లలో జరిగిన రాష్ట్రాభివృద్ధి, పొందిన అవార్డులే త‌మ మంత్రివ‌ర్గం స‌మ‌న్వ‌యానికి నిదర్శనమని యనమ‌ల అన్నారు. సంక్షేమ పనులకు - అభివృద్ధికి అడ్డంకులు సృష్టించవద్దని వైకాపా నేతలను ఆయన కోరారు. కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాజకీయాలు చేయడం తగదని యనమల రామకృష్ణుడు అన్నారు. హామీలు నెరవేర్చినందుకే తెలుగుదేశం పార్టీకి సహకరించాలని చంద్రబాబు ప్రజలను కోరారని ఆయన చెప్పారు. అది బెదిరించడమెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి - సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే వైసీపీ - కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

కాగా రాష్ట్రంలో ఈనెల 30వ తేదీ నుంచి అన్ని చెక్‌ పోస్టులను తీసివేస్తున్నట్లు యనమల ప్ర‌క‌టించారు. దేశంలోని అన్ని రంగాల వ్యాపారుల అభిప్రాయాలు - సలహాలు తీసుకున్న అనంతరమే జీఎస్టీని ఏర్పాటు చేయటం జరిగిందని, ముఖ్యంగా పేద ప్రజలపై భారం పడకుండా, వ్యాపారులకు ఇబ్బంది కలుగకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో వ్యాట్‌ అమలు విషయంలో కూడా కొంత మందికి కొన్ని అపోహలు - అనుమానాలు ఉండేవని, తదనంతరం అవి తొలిగిపోయాయని చెప్పారు. జీఎస్టీ విషయంలో కూడా మొదటిలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. వ్యాట్‌కు, జీఎస్టీకి కొద్దిపాటి తేడా మాత్రమే ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాకినాడకు యానాంలో ఉన్న రేట్లకు తేడావుంటుందని, ఇక మీదట దేశం మొత్తం మీద ఒకే విధంగా రేట్లు ఉంటాయన్నారు. ఫెడరల్‌ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక పన్ను విధించే వెసులుబాటు ఉందని, ఈ విధంగా కేంద్రానికి కూడా వర్తిస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తాటిపైకి వచ్చి కొన్ని పన్నులు ఒదులుకున్నాయని, దీన్ని వ్యాపారస్తులు ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ఇప్పుడు పెట్రోలియం - మద్యం తప్ప మిగతావన్ని జీఎస్టీ కిందకు వస్తాయని, అంతిమంగా ప్రజల సంక్షేమం - జాతి ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే జీఎస్టీని రూపొందించటం జరిగిందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/