Begin typing your search above and press return to search.

గల్లాపెట్టె ఖాళీ : విత్తమంత్రి చెత్తమాట!

By:  Tupaki Desk   |   3 Jan 2018 3:51 PM GMT
గల్లాపెట్టె ఖాళీ : విత్తమంత్రి చెత్తమాట!
X
చంద్రబాబునాయుడు ప్రభుత్వం మిగిలిన ఒక్క ఏడాది పరిపాలన కూడా పూర్తయ్యే సమయానికి అసలు కీలకమైన పనులను ఏ కొంతమేరకైనా చేస్తుందా లేదా అనే సందేహం ప్రజల్లో తొలినుంచి ఉండనే ఉంది. ‘‘మేం ఏం చేయకపోయినా సరే.. మీరు భరించాల్సిందే’’ అని సమర్థించుకోడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఏపీ ఆర్థిక మంత్రి ఇప్పటినుంచే మాయమాటలను ప్రారంభించేశారు.. జన్మభూమి వేదికగా.. తమ ప్రభుత్వం అచేతనత్వానికి, నిష్క్రియాపరత్వానికి, అసలు పనులేమీ చేయకుండా కాలయాపన చేస్తున్న వైఖరికి సమర్థింపు డైలాగులు వల్లించడం ఆయన ప్రారంభించారు. నేను పేరుకు ఆర్థిక మంత్రినే.. తాళాలు నా వద్దనే ఉన్నాయి... కానీ గల్లాపెట్టెలో డబ్బుల్లేవు... అంటూ ఆయన జన్మభూమి సభల్లో చెబుతున్నమాటల అంతరార్థం స్పష్టంగానే బయటపడుతోంది. ప్రభుత్వం ఏపనీచేయకపోయినా సరే.. డబ్బుల్లేవు గనుక.. చేయలేకపోయారు.. అని ప్రజలు సరిపెట్టుకోవాలన్నమాట. అందుకే ఆయన ఇలాంటి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఉంది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం మొత్తం ప్రస్తుతం.. జన్మభూమి కార్యక్రమంలో మునిగితేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. జన్మభూమి కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమం అని పేరు పెట్టి.. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పార్టీ శ్రేణులు మొత్తం కష్టించి పనిచేయాలంటూ.. పిలుపు ఇవ్వడం ద్వారా చంద్రబాబునాయుడు ముందునుంచి తన ద్వంద్వ వైఖరి ఏంటో చాలా గట్టిగానే చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభల్లో సర్కారు పెద్దలు చంద్రబాబు ప్రభుత్వం అద్భుతాలు చేసేస్తున్నదనే అసత్యాలతో సొంత డబ్బా కొట్టుకోవడం మీదనే దృష్టి సారిస్తున్నారు.

అయితే మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొనే సభల తీరును గమనిస్తే కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన ఆర్థిక మంత్రి గనుక.. ఆయన నుంచి జనం ఎక్కువే ఆశిస్తారు. ప్రజలకోసం ప్రభుత్వం ఏం చేస్తోందో ఆయన కీలక మంత్రి గనుక.. ఆయన ద్వారా తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే ఆయన చాలా తెలివిగా.. చేదుమాత్రకు చక్కెర పూత పూసినట్లుగా... ప్రభుత్వం చేతగాని తనానికి నిధుల లేమి అనే ముసుగు తొడుగుతున్నారు. పోలవరం గానీ, అమరావతి గానీ.. కీలకమైన విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసింది శూన్యం అని ప్రజలు అసహ్యించుకోకుండా ఉండడానికి.. మా వద్ద నిధులే లేవు.. అప్పులతో ఏదో జీతాలు ఇస్తూ రోజులు నెట్టుకొస్తున్నాం అనే బీద డైలాగులు పలుకుతూ.. యనమల రామకృష్ణుడు ప్రజలను తమకు అనుకూలంగా ట్యూన్ చేయడానికి మాటలు వల్లిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. మొత్తానికి జన్మభూమి సభలను సొంతడబ్బా కొట్టుకోవడంతో పాటూ.. జనం సానుభూతి పొందడానికి కూడా వాడుకోజూస్తున్నారన్నమాట.