Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మానసపుత్రికపై బాబు నిర్లక్ష్యం!

By:  Tupaki Desk   |   14 Aug 2016 5:53 AM GMT
ఎన్టీఆర్ మానసపుత్రికపై బాబు నిర్లక్ష్యం!
X
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులోని తెలుగు విశ్వ విద్యాలయం ఇప్పుడు ఏస్థాయిలో ఉంది? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు - నందమూరి తారక రామారావు మానస పుత్రికైన ఈ విశ్వ విద్యాలయం ఇప్పుడు ఏస్థాయి నిర్లక్ష్యానికి గురవుతుంది? టీడీపీ అధికారంలో ఉండి కూడా ఎన్టీఆర్ మానసపుత్రిక పరిస్థితి ఇంత అధ్వానంగా ఎందుకు ఉంది? పేరుకు విశ్వవిద్యాలయం అయినా కూడా.. సాహిత్య పీఠంలో కేవలం తొమ్మిదంటే తొమ్మిది మంది విద్యార్థులు మాత్రమే ఉండటాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? ఇ విషయాలపై స్పందించారు ప్రముఖ సాహితీవేత్త - మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. తాజాగా తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠాన్ని పరిశీలించిన అనంతరం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మానసపుత్రిక అయిన తెలుగు విశ్వవిద్యాలయం ఈ రోజు ఈ స్థాయిలో నిర్లక్ష్యానికి గురవ్వడంపై ఆయన మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఈ యూనివర్శిటీని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాహిత్య పీఠంలో కేవలం తొమ్మిది మంది విద్యార్థులు మాత్రమే ఉండటంపై స్పందించిన ఆయన.. వారం రోజులుగా ఇక్కడ కరెంటు లేకపోవడంపై నిరాశచెందారు. ఉన్న తొమ్మిది మంది విద్యార్థులు కూడా చివరికి వారి కూడా వారే చేసుకోవాల్సి రావడం.. ఈ ప్రాంతంలో తేళ్ల పాములు మధ్యే వారు జీవించాల్సిన దుస్థితి రావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు బాబు ఇచ్చిన హామీల్లో కేవలం ‘రాజమహేంద్రవరం’ పేరు మార్పు తప్ప మిగిలినవేవీ అమలుకు నోచుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని.. దీనికోసం స్థానిక ఎంపీ మురళీమోహన్ - ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కృషి చేయాలని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు.